పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

288


అనుబంధములు

శ్రీ హయగ్రీవాయ నమః

ఆముఖము

బ్రహ్మశ్రీ మహాకవి కాళ్ళకూరు నారాయణరావుగారి సంపాదకత్వమున కాకినాడ నుండి వెలువడిన 1912 జులై 15 మనోరంజనీ మాసపత్రికలో "కొప్పరపు సోదరకవులు - కాకినాడ” అను శీర్షిక క్రిందఁ బ్రకటింపఁబడి, తమదగ్గఱనున్న మహాకవి కాళ్లకూరు నారాయణరావుగారి వ్యాసమును గుంటూరు అరండల్‌పేట తొమ్మిదవలైను వాస్తవ్యులు ఎం.ఏ. పట్టభద్రులు తిరుపతి వేంకటీయాది గ్రంధకర్తలు సారస్వతాభిమానులు సుహృద్భావులునగు బ్రహ్మశ్రీ గుండవరపు లక్ష్మీనారాయణా మాత్య శేఖరులు సుమారొక సంవత్సరమునకు బూర్వముఁనాకిచ్చి చూడుమనిరి.

నేనా వ్యాసమును జూచుచుండగనే యందలి పద్యములను, నాకడనున్న కొప్పరపు సోదరకవుల రచనలను మఱికొన్ని యితర రచనలను గలిపి యచ్చొత్తించి పుస్తకరూపమునఁ బ్రకటింపనెంచితిని. కాని నేనప్పుడు కొప్పరపు సోదరకవుల చరిత్ర ముద్రింపించుచుండుటచేత బిమ్మట కొన్నినాళ్ళకు ననఁగా 8-9-1972 తేదీన గుంటూరు బ్రాడీపేట నాలుగవ లైనులో నేను ట్యాక్సీ క్రిందపడుటవలనను నింతకాల మాగవలసి వచ్చినది.

భగవదనుగ్రహమున నేనిప్పుడారచనల నన్నిటిని కలిపి “కొప్పరపు సోదర కవులు - ఆశుకవిత - కాకినాడ” యను పేరుతో నచ్చొత్తించి పుస్తకరూపమునఁ బ్రకటింపఁ గలిగినందుకు సంతోషించుచున్నాను.