పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాసములతోనే పద్యములు చెప్పుదురు. అట్టివి వారికి మంచినీళ్ళప్రాయము. వీరి యాశువు విన్నపిదప నేదో యావేశ మేదో యుత్సాహముకల్గి యెందఱో నవకవులు నాశుకవులు పెల్లుబికిరి. ఉన్నతపాఠశాలలోను, కాలేజీలలోను విద్యార్ధులాశువున కుబలాటపడసాగిరి. వీరి యాశుకవిత్వ సభలు చాలమంది కవులను లేవఁదీసినవి. ఆనాఁడు వీరి యాశువుంబ్రశంసింపని కవిలేఁడు. చూడుఁ డీ పుస్తకమును. తిరుపతి వేంకటేశ్వరకవులు వీరిని ప్రశంసించిరి. వీరును వారిని బ్రశంసించిరి. మొదట మైత్రితోనున్న యీ జంటలకు దురదృష్టవశమున నడిమివారు 1911 సం. విరోధము పెట్టిరి. కవులకలహము పాండితీబల పరిశీలన పరివ్యాప్తమైన భాషకుఁబరివృఢమే కాని యట్లుకానిచో మాత్రమది తీరనియపకారమున కాశ్రయమై నిలిచిపోవును.

కొప్పరపు కవులు 1911నకుఁబూర్వమొనర్చిన యవధానములనచ్చైనవాని నేనుజూడలేదు. కాని యప్పటికే వీరి యవధానములు నాశుకవితాసభలు మద్రాసు రాజధానిలో జరిగినవి. కావ్యకంఠగణపతిమునులు, వావిలికొలను సుబ్బారావుగారు, శతఘంటము వేంకటరంగశాస్త్రి, చేన్నాప్రగడ భానుమూర్తి, ముదిగొండ నాగలింగశాస్త్రి మున్నగువారానాటి పండితులు, కవులునందరు వీరిం బ్రశంసించిరి. తిరుపతి వేంకటకవుల శిష్యులు వేటూరి ప్రభాకరశాస్త్రి గారు “వీరలాశుకవితోద్య ద్రాజ్యపట్టాభిషేకమునందందగునట్టి దిట్టలని వక్కాణింతు నిక్కమ్ముగన్” అనిరి. యశోడిండిమ ముంజూడుఁ, డెందఱుకవులెట్లు వీరిని బొగడిరో.

మద్రాసు రాజధాని పండిత కవుల కంఠరవముదెసలఁబ్రాకినపిదప (15-9-1911) బాపట్లలోను, (17-9-1911) విశదలలోను, (1-10-1911) గుంటూరులోను, (16-10-1911) చీరాలలోను వీరిశతావధానములు జరిగినవి. అవి ముద్రింపఁ బడినవి. (25-5-1912) కాకినాడ సభలు ప్రారంభములైనవి. తిరుపతి వేంకటేశ్వరకవులలో దివాకర్ల తిరుపతి శాస్త్రిగారి నాస్థానపండితులుగా నుంచుకొన్న పోలవరము జమీందారు రాజా కొచ్చెర్లకోట వేంకటకృష్ణ రావుబహద్దర్

xxxiii