పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

276

4. వైశ్య వంశజులును సుగుణధనాభిరాములును నగు శ్రీ పెండా పెద్దయ్యన్న గారను పర్యాయనామముగల వేంకటాచలపతిగారిచే వారి గృహంబుననే యొక సభ జరిగింపఁ బడెను. ఆ సభలో రు. 116-0-0లు నొసంగిరి. ఇందాశు కవిత్వమును జెప్పరి.

5. ధనికులును విద్యా రసికులునునగు శ్రీ కొవ్వూరి ఆదినారాయణ రెడ్డి గారిచే వారి భవనంబుననే యొక సభ జరిగింపఁబడెను. ఆ సభలో ననేకవిధములగు సత్కారంబు లొనర్చిరి. ఇందు నాశుకవిత్వమును జెప్పిరి.

ఇట్టి సభలలో వీరికవితా సామర్ధ్యంబును దిలకించి యభిలషించి పండిత కవీంద్రుల నామధేయంబును వారి యభిప్రాయంబులు తేటపడు పద్యంబులును నే నెఱింగినవఱకును నాకు లభించినంతవఱకు నీక్రింద నుదహరించితిని.

కాకినాడ

2-6-1912

ఇట్లు,

చేగంటి బాపిరాజు

గంజామువారి యింటియొద్ద సభలోఁ జదివిన పద్యములు

కవులును బండితేంద్రులును గ్రాల్కొనియుండిన కాకినాడలో
సవిరళశక్తితో సభల నద్భుతలీలల నిర్వహించి కా
కవులకు గర్వభంగమగు కైవడి నాత్మ జయధ్వజంబునున్
నవముగ నాటినారు భువనస్తుతిఁ గొప్పరపుంగవీశ్వరుల్

రారేపోరె మహాకవుల్ నిజవచోరంభంబు సూపింపరే
వారిని వారి కవిత్వమున్ గనియు సంభావింపరే సభ్యులె
వ్వారైనన్ మనకొప్పరంపుఁ గవిరాట్పర్జన్యుఁ లట్లొప్పిరే
స్ఫారప్రజ్ఞకు సభ్యులిప్పగిది సంభావించిరే యెవ్వరిన్