పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
275


కవితాశక్తినిఁ జూపి యింతటి సత్కారంబులంబడసినవారు మఱొక్కరు లేరగుటచే నిచట వీరిసభలను, సన్మాన విషయంబులును నాకుఁ దెలిసినంతవఱకుఁ దెలియంబఱచుచున్నాఁడను.

1. దివాన్ బహద్దరు బిరుదాంకితులును, హైకోర్టు వకీలుగారును నగు శ్రీ దురిసేటి శేషగిరిరావు పంతులుగారును, పండిత కవీంద్రులయిన శ్రీ కస్తూరి శివశంకర శాస్త్రిగారును, అగ్రాసనాధిపతులుగా శ్రీ గంజాము వేంకటరత్నము పంతులుగారి కళ్యాణ భవనంబున శ్రీ పంతులుగారి ధర్మపత్నియును సుగుణవతియునగు మాణిక్యాంబ గారిచే నొకసభ జరిగింపఁ బడెను. ఆ సభలో రు.116-0-0లు బహుమానమొసంగిరి. ఇందు సీతాకళ్యాణ మాశుప్రబంధముగాఁ జెప్పఁబడినది.

2. శ్రీ పోలవరము జమీందారుగారును, సరస్వతీపత్రికాధిపతులునునగు. శ్రీ రాజా కొచ్చర్లకోట వేంకటకృష్ణరావు బహద్దరు జమీందారుగారును, పండితవర్యులగు శ్రీ వంకా వేంకటరత్న శాస్త్రిగారును అగ్రాసనాధి పతులుగ నీ కాకినాడ మహాజనులందఱచే శ్రీ పిఠాపురపు మహారాజాగారి కాలేజీలో నొక మహాసభ జరిగింపఁబడెను. ఆ సభలో రు.232-0-0 లును, 2 బంగారపు బిరుద మండనములును నొసంగిరి, ఇందు భీష్మ జనన మాశుప్రబంధముగాఁ జెప్పఁబడినది.

3. ఆంధ్రాక్షరతత్త్వాదిగ్రంథకర్తలును, వైయాకరణులును, విద్వత్కవి వరేణ్యులునునగు శ్రీ పాడి వేంకటస్వామిపాఠీ గారగ్రాసనాధిపతులుగా నీ పురమందు సుజనరంజనీ ముద్రాక్షరశాలాధిపతులును విద్యావిశేషులునునగు శ్రీ పోతాప్రగడ బ్రహ్మానందరావు పంతులుగారిచేఁ దమ మందిరంబుననే యొకసభ జరిగింపఁబడెను. ఆ సభలో రు.116-0-0లును రెండు బంగారపు బతకములును నొసంగిరి. ఇందుఁగంసవధయు, నభిమన్యువధయు ఆశుప్రబంధములుగాఁ జెప్పఁబడినవి.