పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
271


గుంటూరు సభలు

(ఎ) గుంటూరు సభలో బ్రహ్మశ్రీ బలిజేపల్లి లక్ష్మీకాంతముగారిచే చదువఁ బడిన పద్యములు

సారవిస్తార కవితాప్రశస్తులార!
ప్రధిత దివ్యాశుకవి చక్రవర్తులార!
సోదర కవీంద్రులార! వాక్శూరులార!
భవ్య గుణులార! మీకిదే స్వాగతంబు

దురమున బల్లిదుండరులఁ దోలెడుచో వెనుకంగవేయన
ట్లురవడిఁ బద్యముల్ పలుకుచుండి పిఱిందికిఁబోక పల్కులన్
బొరపడకుండ గ్రంథశతముల్ వచియించు తెఱంగుభూమిపైఁ
దిరుపతి వేంకటేశకవి ధీరులకున్ మఱి మీకె చెల్లెఁగా.

చెలఁగి కోకోయటంచుఁ గోయిలల జంట
కొసరుచున్ మావిపైనెక్కి కూయునట్లు
కోవిద చయంబు మెచ్చఁ గోకో యటంచుఁ
గవితఁజెప్పెదరౌ మేటి కవుల జంట

ఆరసి కొండవీటికవిహంసలటంచును మీకు మా పురీ
పౌరు లొసంగిరా బిరుద పంక్తికి బైన వతంస శబ్దమున్
గూరిచినన్ భవత్కవితకుం దగదే యేవరెట్టులన్న నే
నారసి కొండవీటికవిహంసవతంసులటంచుఁ బిల్చెదన్

వాదోడై యలవాణి పద్యశతమున్ బల్కింప శ్రీదేవియున్
జేదోడై కనకాభిషేక శుభమున్ జేకూర్ప నానావధా
నాది ప్రక్రియలంది దిగ్విజయ యాత్రారంభ శుంభద్యశః
ప్రాదుర్భావముచేత మించితి రనల్పంబిద్ది సామాన్యమే?