పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
267



అయ్యది యిప్పుడు నివృత్తియయ్యెను. వేంకటరామశాస్త్రిగారి యష్టావధానంబును రామ కృష్ణశాస్త్రిగారి శతప్రాసంబును నేమోగాని యంత సంతోషదాయకములుగా లేవ”నుకొనిరి. ఈ పంక్తులు నీవు చదువనే లేదా!
ప్రకా : చదివితిని గాఁబోలు (స్మృతినభినయించి) అవును. అక్టోబరునెల పేపరులోఁగాదు! ఆ! చదివితిని, ఒక సంశయము వారు శతావధానులే కాక యత్యద్భుత శతావధానులు గదా! అష్టావధానమే బాగుగనుండకుండుటకుఁ గతమేమో?
శశి: నాకేమి తెలియును, ఆ సంశయము నీవే తీర్పవలెను.
ప్రకా : అయినచో గ్రంథమాల నాయొద్దనే యున్నది. (పుస్తకమువిప్పి) అబ్బే! దీనికింత విచారమెందుకు? వారు వ్రాసికొన్న పంక్తులే సాక్ష్యమిచ్చు చున్నవి. "గురువారమున నొక యష్టావధానము జరుపఁబడెను.
దానఁ బ్రాచీనంబులగు రీతుల వదలి ... భాగము లేర్పఱుపఁబడెను. (2వ పుట) ప్రాచీనరీతులు వదలిన తరువాతఁబే రెట్లు వచ్చును, ప్రాచీను లేమి మూర్ఖులా!
శశి: అంత మాత్రముననే కాదు ఇంకను నేమేని లోపములున్నవా? ఏదీ ఆ పుస్తకమిట్లు తెమ్ము
ప్రకా: (ఇచ్చును.)
శశి: (విప్పి) అబ్బో! వీరి యవధానమునకును దానికిని హస్తిమశకాంతరముగా నున్నది. పిఠాపురపువారి యవధానములో కవిత్వమునకై మూఁడు గీతములు మాత్రమున్నవి, కొప్పరపువారి యవధానమునఁ దొమ్మిది పద్యములున్నవి. మొదటి వారి గీతములు మూఁడును నొకటే విషయమును జెప్పుచున్నవి. రెండవవారివి భిన్న భిన్న విషయములను జెప్పుచున్నవి. తుట్టదుద నొక సమస్య మాత్రమే మొదటివారి యవధానమునఁ గలదు. రెండవవారి యవధానమున రెండు సమస్యలు గలవు. దానికిని దీనికినిగల తారతమ్యమును నీవే తెలిసికొనఁగలవు. కాన నవి చదువుచుంటిని.