పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

266

శశి : (ప్రవేశించి) ఇదిగో! మా ప్రకాశిక (సమీపించి) చెలీ! కుశలమా?
ప్ర కా: నీ దయవలనఁ గుశలమే. నేను నీరాకకయియే చూచుచున్నదానను. మొన్న (8)వ తేదిని బ్రకటించిన యష్టావధానమున బ్రహ్మశ్రీ యత్యద్భుత శతావధానుల పేరు సుంతయు నెత్తలేదేమి?
శశి: వారెవరు?
ప్రకా : ఎవరా? రామకృష్ణగ్రంథమాల చూడనేలేదా? అత్యద్భుత శతావధానులు.
శశి : అయినచో మొన్న కన్యకాపరమేశ్వరి యాలయమున నవధాన మయినతఱి వారిప్రశంసయే రాలేదే ప్రకా : ఆ కొప్పరపు జంటకవు లింక నెవరి పేరులుచెప్పిరి.
శశి : నీవంతయు నావలన నెఱింగియును మరల నడిగెదవేల! తిరుపతి వేంకటేశ్వరుల నెత్తికొనుట నీవెఱుఁగవా?
ప్రకా : (స్మృతినభినయించి) అవును, సభ్యులకోరికమీఁదను.

చ. అరుదుగనిచ్చమెచ్చి విబుధావళియే తమశ్లోకమెన్నఁగా
    హరువుగ శ్రీసమన్వితులునై విజయానుచరత్వమూనియా
    తిరుపతి వేంకటేశ్వరుల తీరునఁ జెప్పఁగనొప్పినారిలన్
    దిరుపతి వేంకటేశ్వర సుధీరులె శ్రీకనుపర్తివంశజా.

శశి : చూచితివా! ఈ వేంకటసుబ్బరాయ వేంకటరమణకవీశ్వరుల కవితాధార. ఆశువులో శ్లేషనుగూడ నెలకొల్పుట కెట్టిధారయుండవలెను? ఇట్టివారేదో మసిపూసి మారేడుకాయఁజేయు కవుల నెత్తికొనకుండుట తప్పుకాదు.
ప్రకా : వారియవధానమునకు దీనికిని దారతమ్యము నీవేమి కనిపెట్టితివి?
శశి : నేను గనిపెట్టుట యెందులకు! నీవీమధ్య దేశమాతనే చూచుటలేదా యేమి? ఆమె యిట్లు వాక్రుచ్చినది.
“ఆస్థానకవులగు వేంకటరామకృష్ణకవులు వేర్వేఱ సాయములేక నవధానములు తప్పక చేయఁగలరా? యని కొందఱికి సంశయ ముండెడిది.