పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
259

టరు శకటంబు ధూమ శకటంబుల బల్వడి మించునంచు భే
షరెరె యటంచు నౌర భళి యంచు నహాయనుచున్ బలే బలే
యరుదరుదంచు బాగురెయటంచును బాపురె వాహ్వయంచు న
ద్దిర యనుచున్ శభాష్షనుచు దివ్యమటంచు నయారె మేలు మేల్
వెరివెలటంచు ముక్కుపయి వ్రేలిడుచున్ దలలూపనట్టి వా
రరయ నభావమే సభల యందది యేమొ సభా సదాళి గొ
ప్పర వర వంశ మౌక్తిక విభా విభవాంచిత మూర్తులార! శ్రీ
తిరుపతి వేంకటేశ్వర సుధీశ్వర శంసిత కీర్తులార! స
ద్వర కవులార! వేంకట పదద్వయ పూర్వక సుబ్బరాట్కవీ
శ్వర రమణాభిధాన కవిసత్తములార! గొనుండివే నతుల్.

సంస్కృతాంధ్ర పండితకవి శ్రీ పంగులూరు రామచంద్రయ్య పంతులుగారు

శ్రీమన్నిర్మల భవ్య కొప్పరకుల క్షీరాబ్ది రాకాసుధా
ధాముల్, కొప్పరనామధేయ నగరీ ధాముల్, మహామంత్రి సు
త్రాముల్, వేంకట సుబ్బరాయ రమణ ప్రఖ్యాత నాముల్, కవి
స్వాముల్ గాంతురు గాత శ్రీపతి కృపన్ సర్వేప్సితార్ధంబులన్

ఆరంభంబున కన్యకాభగవతీ హర్మ్యంబునన్ రెండు మా
ర్లూరవ్యాగ్రణి భాష్యకార్ల గృహ మందొక్కప్పుడా పిమ్మటన్
శ్రీ రామానుజ కూటమందొక యెడన్ జిత్రంబుగాఁ జేసిరీ
ధీరుల్ నాల్గు శతావధానములు సద్విఖ్యాతి దీపింపఁగన్.

అవధానంబులఁ బెక్కుజూచితిమి మున్నందందు నెందేనియున్
వివిధానల్ప సుకల్పనా నిపుణతన్ విద్వద్వరుల్మెచ్చ న
వ్యవధాన స్ఫురణోచితాశుకవితా వైచిత్రితో వీరియ
ట్లవధానంబొనరించు బాలురను విద్యాశాలురన్ గంటిమే.