పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
255

బహ్మశ్రీ ఆర్య సోమయాజుల లక్ష్మీనారాయణ శాస్త్రిగారు

వర వేంకట రమణ సుధీ
వర వేంకట సుబ్బరాయ పరికించితి మీ
సరస కవిత్వపు ధోరణి
పరమానందంబు నెదను పాదుకొలిపితిన్

సాయంనటన్నటేశ్వర జటాతటవిని
           ర్గతగాంగభంగాళికల్పనాళి
మాకంద గోస్తనీ మాకరంద రసాతి
           రేకంబునకు మంజు టీక పాక
మన్యోన్యచరిత వాక్యార్ధ నిర్దూత న
           వ్యశిరీష పేశల వ్యక్తిసూక్తి
పండితాహ్లాద కృద్భావ రసౌచిత్య
           హృద్యానవద్యంబు పద్య సరణి

జవవిభిన్న నిరాఘాట సవితృఘోట
గరుడ పవమాన పరిపాటి కవన ధాటి
గురుతరంబుగ మీకుఁ జేకూరి నౌర
సూరి నుతులార! సోదర సుకవులార!

సరసత్వంబు మనోహరత్వము ప్రశస్తత్వంబు శోభిత్వమున్
బురుషార్ధప్రతిబోధకత్వమును సంపూర్ణప్రభావత్వమున్
పరమార్ధప్రతిపాదకత్వమును సంప్రాప్తించి రాణించుతన్
నిరతంబున్ భవదీయ మంజుతర వాణీధోరణిన్ ధారుణిన్

ధారుణిలో ననేకు లవధానము లెన్నియొ మున్నానర్చుచున్
బేరును బెంపుగాంచిరని వింటిని, గంటిని నేఁడు మిమ్ముఁ, జే
కూరిన తృప్తిఁబద్యములఁ గొన్ని యొసంగితిఁ గాన వీని వే
యారులుగాఁదలంచి యుపహారముగాఁ గొనరయ్య వేడ్కతోన్