పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

ధరపయి స్వర్గమబ్బెఁగడు ధన్యులమైతిమి నేఁడు మీదయన్
వరకవిసింహులార! ప్రతిభా విభవోజ్జ్వలులార! భవ్య కొ
ప్పర వర వంశవారినిధి పార్వణ శీతమయూఖులార! సో
దర కవులార! గైకొనుఁడుదారత మా యభివందనంబులన్
సరస కవీంద్ర సత్తములు సారవచో విభవాభి రాములౌ
తిరుపతి వేంకటేశ కవిధీరుల మన్ననఁగన్న మిమ్ము మే
మెఱిగి ప్రశంససేఁత జగమెల్ల నెఱింగిన యల్ల విప్రశే
ఖరునకు జన్నిదంబిడుట కావున నే విరమింతు నింతతోన్

పరిచిత భాసురార్ధపద బంధము లందముగాఁగఁ బద్దెముల్
సరసవచస్థ్సితిం దవిలి సర్వజనుల్ నుతియింప గంటకున్
బరువడి మూఁడునూరులు ప్రబంధముగా రచియింప నేరికిన్
దరమగునే మహిన్భవదుదార పురాకృత పుణ్యసంపదం
బరగెడు మీకుఁగాక కవిమాన్య సుధీయుతులార! యారయన్

వరమతినన్నపార్యుఁడును వాఙ్మయలోకవిధాతయజ్వయున్
సురుచిర బంధ దక్షుఁడగు సూరీవరేణ్యుఁడు శంభుదాసుఁడు స్వరకవితాపితామహుఁడవంధ్యచరిత్రుఁడు పెద్దనార్యుఁడున్
మఱియును వన్నెగన్న కవీమాన్యు లనేకులు కీర్తిశేషులై
యఱుఁగుటఁ జేసి వారి కవితామృత ధార పరోక్షరీతి న
క్షరమయ కావ్యరూపమునఁ గాంచుటె గాని సచేతనాకృతిన్
వరలఁగ జూచి సంతసిలు భాగ్యములేని కొఱంత కొంత దా
మరలు సరస్వతీ మహిత మంగళ విగ్రహులౌచు నిట్లు గొం
దఱు కవితావిలాస సముదంచిత బుద్ధిసమిద్ధు లిద్దరన్
దొరకి వచోమృతంబు దయతో వెదజల్లుచు నుల్లసిల్లఁగన్