పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

“కొప్పరపు సోదరకవులు" మహాకవి' శ్రీ కాళ్లకూరి నారాయణరావు గారి మాటలలో

“సభలోన మాటాడ జాలుటే గొప్ప, ప
          ద్యములతో నగుట చోద్యంబు గాదె!
 తడబడుచైనఁ బద్యంబల్లుటే గొప్ప,
          పరమాశుధార యబ్రంబు గాదె!
 అడిగిన పద్యమొండైనఁజెప్పుట గొప్ప,
          గంటకేనూఱు లక్కజము గాదె!
 ఉర్విలో నిట్టి వారొకరు పుట్టుటే గొప్ప,
          యిరువురొక్కింట నచ్చెరువు గాదె!”

ఇంతటి కొప్పరపు కవుల గురించి నేటికీ చాలామందికి తెలియదు. వీరి సాహిత్యంతో చాలామందికి సాన్నిహిత్యం లేదు, పరిచయమే లేదు. టేప్ రికార్డర్స్, వీడియో కెమేరాలూ ఆ కాలంలో ఉండి ఉంటే రికార్డు స్థాయిలో 'ఆశుకవితా విన్యాసం' చేసిన వీరి సాహితీ సర్వస్వం మనకు "సంపదగా” ఉండిపోయేది. అయితే ఉండి 'పోయింది', 'రికార్డర్స్' లేక....

'ప్రజాకవి'గా వేమన పరిచయమవడానికి బ్రౌన్ దొరగారి కృషి ఎంత ఉందో అందరికీ తెలిసిందే మన సంస్కృతిపైన ఉన్న మక్కువతో ఆయన చాలా ప్రాంతాలలో శోధించి, తాళపత్రాల రూపంలోనూ మౌఖిక సంప్రదాయంలోనూ దాగి ఉన్న వేమన సాహితీ సంపదను సాధించి, అచ్చు వేయించి తెలుగుజాతికి వెలుగు చూపించారు. జాతి సర్వస్వం బ్రౌన్ మహనీయునికి ఋణపడే ఉంటుంది. అట్లాగే కొప్పరపు సోదరకవుల వాక్ ప్రవాహాన్ని, స్వయంగా చూసి, ఆనందపడి, ఆశ్చర్యం చెందిన 'అభిమాని-ధనం'లో ఒక విలువైన 'రూపం' అయిన కుంటముక్కల జానకీ రామశర్మ గారు 70 ఏండ్ల పైబడిన వయస్సులో అవిశ్రాంత కృషి చేసి కొప్పరపు వారి సాహిత్యాన్ని సేకరించి శ్రీ గుండవరపు లక్ష్మీనారాయణ గారికి అందజేస్తే, ఈనాడు "కొప్పరపు సోదరకవుల" గురించి తెలుసుకోవడానికి ఒక గ్రంథం రూపంగా బయటకు వచ్చింది.

xxii