పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
160


రౌద్రిసంవత్సర శతావధాన ప్రశంసా పద్యములు

శ్రీయుత కొప్పరంపుఁ గవిశేఖరులార! నియోగివంశ ర
త్నాయతనాబ్జులార! కవితా వనితావసతీకృతాత్మ జి
హ్వాయుతులార! ధీరవరులార! నమస్కృతులాచరించి మీ
కీయెడఁ బద్యపంచకమునిచ్చితిఁ గూరిమి స్వీకరింపరే

శారద మీస్వరూపము ప్రశస్తయశోధనులార! సాటి మీ
కేరునులేరు మీకయిత యెందసమాన, వలంతులీరు నా
కోరికదీరఁ బద్యములఁగూరిచి యర్పణం చేసికొంటి మీ
ధారకు ధారణాస్థితికిఁ దద్దయు విస్మయమంది ధీనిధుల్

అవధానంబులు పెక్కు సల్పితిరి రాజాస్థాన రంగంబులన్
బవమానత్వరమించునాశుకవితా ప్రావీణ్యముంజూపినా
రవనీనాథులు సత్కవుల్ బుధులు మిమ్మగ్గించుచున్నారలో
కవిసర్వజ్ఞవతంసులార! పొగడంగా శక్యమే నాకిఁకన్

కరమని రసజ్ఞులెంతొ యాదరముమీఱ
మీకు వేయాఱులొసఁగుచు వీఁకగూర్తు
రర్ధరహితుండనౌటఁ బద్యంబులేను
శక్తికొలఁదినర్పించితి సరగఁగొనుఁడు

తృణమో, కణమో, భక్తిని
ప్రణతుఁడనగు చేనొసఁగితిఁ బరఁగంగొనుండీ
యణువే మేరువటంచని
గణుతించుచుఁ బ్రేమమీఱఁగా మీరెడఁదన్

రౌద్రి సంవత్సరాశ్వయుజ బ౧౧ లు

ఇట్లు.

యామర్తి వేంకటసుబ్బారావు