పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సంపాదకీయము

కొప్పరపు సోదర కవులనగా కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి (1885-1932), కొప్పరపు వేంకట రమణ కవి (1887-1942). వీరు గుంటూరు జిల్లా యందలి నరసరావుపేట ప్రాంతము నందలి కొప్పరము గ్రామ వాసులు. వీరు సోదరులు. అందువలన కొప్పరపు సోదర కవులుగా ప్రసిద్ధులు.

వీరు ఆశువుగా గంటకు నాలుగు వందల పద్యములను ఎన్నోమారులు పండితుల సమక్షమున చెప్పిన అసాధారణ ప్రతిభావంతులు. “బాలసరస్వతి”, “ఆశుకవిచక్రవర్తి”, “కథాశుకవీశ్వర” మొదలగు అనేక బిరుదములను పండితులచేత పొందినవారు. పండితులు వీరి శక్తికి నీరాజనము పట్టి చెప్పిన ప్రశంసాపద్యములే సహస్రాధికముగా కలవనియు, వీరు ఆశువుగా చెప్పిన పద్యములు లక్షల కొలదిగానున్నవనియు సమకాలిక పండితుల సాక్ష్యములున్నవి.

ఇంతటి ప్రతిభావంతుల లక్షల పద్యములు లిఖిత రూపము ధరింపక గాలిలో కలసిపోవుట ఆంధ్రుల దురదృష్టము. వారు పల్కిన పల్కులన్నియును పద్యములే. ఎన్నని వ్రాయగలరు? సమకాలిక పత్రికలు కొన్నింటిని ప్రచురించినవి. కాని నేడు అవి అలభ్యములు.

మదరాసు సభలను గూర్చి, గుంటూరు సభలను గూర్చి చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాదుగారు, అట్లే కాకినాడ సభలను గూర్చి చేగంటి బాపిరాజు గారు సేకరించి ప్రచురించిన చిన్న పుస్తకములే ప్రధానములైన ఆధారములైనవి. ఈ ఇరువురి మహానుభావులకు ఆంధ్ర సాహిత్య లోకము ఎంతయో ఋణపడి యున్నది.

శిథిలావస్థలోనున్న (1911వ ప్రాంతమునాటి) ఈ రెండు సంకలనములను, అచ్చటచ్చట అచ్చైన కొన్ని అవధానములను, కొన్ని పద్యములను కష్టపడి సేకరించి, విరాళములు పోగుచేసి పునర్ముద్రణము కావించినవారు కుంటముక్కల