పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొప్పరపు సోదర కవులకు కోటి దణ్ణాలు

- తనికెళ్ళ భరణి

“పద్యం తెలుగువాడి స్ఫూర్తి
 పద్యం తెలుగు'వాడి' కీర్తి
 పద్యం తెలుగువాడి సొమ్ము
 పద్యం తెలుగువాడి దమ్ము”

అలాంటి పద్యాన్ని ఈవాళ మ్యూజియంలో పెట్టాల్సిన దుస్థితి వచ్చింది. తెలుగు పిల్లలకు కాన్వెంటులో టీచర్స్ చెప్పే "ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్” కంఠతా వచ్చుగానీ వేమనగారి "ఉప్పుకప్పురంబు” పద్యం రాకపోవడం తెలుగుజాతి దౌర్భాగ్యం.

ఒకనాడు పద్యం పట్టపుటేనుగు నెక్కి ఊరేగింది.
ఊరేగించిన వారు తిరుపతి వేంకటకవులు
తరువాత పల్లకిలో ఊరేగింది
ఊరేగించినవారు కొప్పరపు సోదరకవులు

“శత ఘంట కవనం” వినడానికే విచిత్రం! మనం ఒక పద్యం కంఠతా పట్టడానికే గంట కావాలి. అలాంటిది "కొప్పరపు సోదరకవులు" గంటకు వందల కొద్దీ పద్యాలు ఆశువుగా చెప్పడం సూపర్ కంప్యూటర్ యుగంలో కూడా ఊహించలేని అద్భుతం.

అలాంటి మహానుభావుల కవిత్వాన్ని ఓ పుస్తకంగా తీసుకురావడానికి "మా. శర్మ” చేసిన 'యజ్ఞం' సామాన్యమైనది కాదు. అతడు ఈ కృషితో తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా సోమయాజియైపోతాడు.

గత 30 ఏళ్ళుగా “కొప్పరపు సోదరకవుల” వ్యక్తిత్వాన్ని ఆరాధించి, సాహిత్యాన్ని ఆస్వాదించి మనకీ అద్భుతాన్ని ప్రసాదిస్తున్న డా॥ గుండవరపు లక్ష్మీనారాయణ గారు కృష్ణ దేవరాయల కాలంలో పుట్టుంటే 'గండపెండేరానికి' అర్హులు.

ఈ పుస్తకం మళ్ళీ తెలుగులోను, తెలుగు వాళ్ళలోను పద్యం పట్ల మక్కువను ఎక్కువను చేసే మాధ్యమంగా పనికొస్తుందనీ... తెలుగు సారస్వత సరస్వతికి కర్పూరపు నీరాజనాలిచ్చి ఆ పరీమళాలను శాశ్వతం చేసిన 'కొప్పరపు సోదరుల' ఆత్మలకు - ప్రదక్షిణం చేసే అస్మదాదులింకా ఉన్నారనీ నాకు ఒకానొక నిబద్ద విశ్వాసం.