పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
138


హింపనెంచి, యది సత్కవికృత గ్రంథ ప్రభూతంబుగానెంచి సుప్రసిద్ధులును, తెనాలి పురవాస్తవ్యులునునైన బ్రహ్మశ్రీ మతుకుమల్లి నరసింహ కవివరేణ్యుల నిజాస్థాన కవివరేణ్యులుగ నిల్పికొని శ్రీమచ్చెన్నపురీవిలాస ప్రముఖకృతి పరిగ్రహణం బాచరించి కీర్తి లక్ష్మీ పరిగ్రహణం బాచరించికొనిరి. నాఁటనుండి యీ సంస్థానము విద్వత్సంస్థానమనియుఁ బేర్కొనంబడుచుండెను. సర్వవిధములఁ బితామహ తుల్యులైన శ్రీవారు తమ రాజ్యస్థానభాగమగు తోట్లవల్లూరు పట్టణమునకు విచ్చేయుటకు, నంతకుఁ బూర్వమే శ్రీ శ్రీ వేణుగోపాలదేవ మహోత్సవ సందర్భమున శ్రీవారి పినతండ్రిగారి పుత్రులైన శ్రీరాజా బొమ్మదేవర సత్యనారాయణవరప్రసాదరావు బహద్దరు జమీందారు వారొసంగు వార్షికసత్కారమునకై మేమటకు వచ్చి యుండుటయుఁ దటస్థించినందున శ్రీ వారికిని మాకును సందర్శన సల్లాపములు సంభవించినపుడు శ్రీవారికి విద్య యందును మాయందును గల ప్రీతిగౌరవములు ప్రకటితములగునట్లు, అనువత్సరమును వారాచరించు శ్రీదేవీ నవరాత్రవ్రత మహోత్సవములకు మమ్మాహ్వానించిరి. తన్మూలమున మేమును శ్రీవారి విద్యాదరములకు సంతసించి వారి యుద్దేశానుసారముగాఁ బంగిడి గూడెమునకు శ్రీమద్రౌద్రి సంవత్సరాశ్వయుజ మాసారంభమున వచ్చి యట శ్రీవారి యభీష్ట ప్రకారము శతావధానముం గావింపఁగా శ్రీవారందుల కానందించి గజారోహణోత్సవంబుం గల్గింపఁజేసి అయిదునూటపదియాఱులు రూప్యము లొసంగి బిరుదస్వర్ణ మండనములతో రాంకవాదికసువస్త్ర గౌరవంబు లొనర్చి ప్రతి సంవత్సరము ఏతన్మహోత్సవ సమయమున కరుదెంచి వార్షిక సత్కారమందు నట్లుగా నియమపత్రం బొసంగి యానందింపఁజేసిరి. మఱియుఁ దామట్లు సత్కరించుటయే కాక తమ కాప్తులును రసికప్రభువర్యులునునగు మహారాజరాజశ్రీ శ్రీ రాజా కందిమళ్ళ వేంకటరామనరసింహారావు బహద్దరు జమీందారువారి అశ్వారావుపేటలో వారియాస్థానమున మాకవిత్వావధాన విశేషములను జూపం దగినయేర్పాటొనరించి శ్రీవారి సన్మానములచే మమ్మానందితులనుగా నాచరించిరి. మఱియు శ్రీ మద్దుర్మతి సంవత్సరమున శ్రీరాజావారి యొక్కయు బంధువుల యొక్కయు, అభిప్రాయానుసారముగా సంపూర్ణ శతావధానముం గావింపఁబడియె.