పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అవధాన సరస్వతీ పీఠమ్

హైదరాబాదు-500 027

తిరుపతి వేంకటేశ కవిధీరుల ధీరత కుద్దిగాగమీ
పరపతి సత్ప్రబంధ రసబంధుర పద్య మహాశువేగవత్
పరిమళమై దిగంతములఁబండెను, పండిన మీ తపస్య కొ
ప్పరపవధాని సోదరుల భవ్యకవిత్వముఁబ్రస్తుతించెదన్

        ఆశూక్తమ్ముల కావ్యసౌధములు విద్యాశేముషీవైభవ
        ప్రాశస్త్యమ్మున స్వర్ణగోపురశిఖాప్రాగల్భ్యమున్ జూప త
        ద్రాశీభూత విమానగోపురములే తచ్ఛారదాపాద సం
        వేశీ వృత్త రణత్సునూపురములై విన్పించె సూరిద్వయీ!

సమకాలీన సమాజదర్శన కళాసౌందర్యమాధుర్యమై,
నమదస్తోక కవీంద్రవాగ్విభవమై, నవ్యమ్మునై, వార్షుకా
భ్ర మహావేగ నభస్వదుత్థరసధారావర్షమై, శ్రోతృవ
ర్గము తృప్తిన్ గన కొప్పరంపు కవియుగ్మశ్రీ మహాధారయౌ

        కప్పురమొప్పు పల్కులు, సుఖావహమైన జవాజి పుల్కులున్
        గుప్పను కస్తురుల్, కొదమ గుల్కులు, శేషుని మేని తళ్కులున్
        కొప్పరపున్ కవీశ్వరుల క్రొత్తల కైతల కోటి పల్కులున్
        విప్పు సరస్వతీవదన వీథికి ముక్కర ముద్దు గుల్కులున్

స్నేహాలంబిత వంశసూత్రుడు, వచశ్శ్రీహాసుడాఢ్యుండు, మీ
దౌహిత్రుండగు 'శర్మ' కొప్రపు లసద్వంశంబు ధన్యంబుగా
సాహిత్యాక్షర తర్పణమ్మునిడె దీక్షన్ మీకు గ్రంధాకృతిన్
వ్యాహారశ్రుతి! సుబ్బరాయ కవిరాయా! వేగ పద్యాశ్రయా!

మాడుగుల నాగఫణి శర్మ

అవధాన సహస్రఫణి

'మాజీ అధ్యక్షుడు అధికార భాషా సంఘం'