పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
86

46. అగ్ని నీటిలోఁ బుట్టి నీటిచేఁ జల్లారినట్లుగా మఱికొన్ని సీసములో వచ్చునట్లు చెప్పుడి

జలముచేఁబుట్టియు జలముచేఁబిమ్మట
          నగ్ని చల్లారిన యట్లుగాఁగఁ
దానురాక్షసుఁడయి తగరాక్షసునిచేత
          నలరావణుఁడు చచ్చి నట్లుగాఁగ
దానుక్కుఁగమ్మియై తగునుక్కు శాణమ్ము
          నం దదితెగిపోయి నట్లుగాఁగ
దానొక్క మత్స్యమై తగమత్స్యమునఁ జేసి
          యసువుల విడనాడి నట్లుగాఁగ

నొక్కవంశంబులోఁబుట్టి యోర్వలేమి
కాపురంబుగనుండిన కౌరవేయ
పాండవేయులు హతులైరి బవరమందు
నరయ నన్యోన్యబాణ ప్రహారగతుల

47. ఏమియులేనిచోట నేమియున్నది

ఇలపై నేమియు లేనిచోట మఱితానేముండునో యంటివౌ
బళిరే యల్ల చిదంబరస్థలమె యాభావంబుఁజూపించెడిన్
గలిమిన్‌గోవెల దేవుడుండెనని వక్కాణింత్రు నిక్కంబుగాఁ
గలయన్‌జూచినఁబోవు సందియము వాక్యార్ధంబులింకేటికిన్

48. గడ్డిపోచ

తెలియక గడ్డిపోఁచ యని తేలికగాఁ బలుకంగవచ్చునే
యిలపయి నట్టి గడ్డిఁదినియేగద యావులు పాలొసంగుఁ బ
ఱ్ఱెలుమఱిగొఱ్ఱెలున్ బ్రతికి ప్రీతినొసంగెడు నిండ్లఁ గప్పనౌ‌
గలిమిని దాననైన నుపకారములిన్నియు నిట్టులుండఁగాన్.