పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

79

20. తీసివేసిన గోరు

కష్ట సుఖంబుల గణియింప కుండిన
          పూరుషు నొక్కనిఁ బోల్చవచ్చు
నయమింత లేక యనామధేయుండైన
          పూరుషు నొక్కనిఁబోల్చవచ్చు
నిత్యంబు పరుని నిందించుటే పనిగల్గు
          పూరుషు నొక్కనిఁబోల్చవచ్చు
తన తప్పెఱుంగ కన్యుని తప్పు వెదకెడి
          పూరుషు నొక్కనిఁబోల్చవచ్చు

నవసరంబైన యపుడు కవ్యగ్రగణ్యు
లిట్టి విషయంబులకును దానిక్క యనఁగ
గొప్ప పదవి వహించిన గుఱుతెఱుఁగక
తీసివేసిన గోరని తెగడఁదగునె.

21. గుంటూరు కాలేజి ప్రిన్సిపాల్ యూల్ దొరగారిని గుఱించి - తరలము

అమెరికాన్ జనియించి సర్వకళాఢ్యుఁడై యిపుడిండియాన్
సుమహితంబగునట్టి గుంటురుస్కూలులో నధికారియై
విమలబుద్ధుల నెల్ల బాలురు విద్య నేర్వఁగ నేర్పి తా
క్షమయు శాంతి యెసంగ యూల్ దొర చాలకీర్తిభరించుతన్

22. సమస్య : రోమము సౌఖ్యమిచ్చుచును బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్‌

ఏమొక పక్షమూనుకొనుటేటికిఁ బౌరులమౌటఁ జేసి మా
కేమిటనైనఁ గష్ట మొకయించుక రాదది యెట్టులన్న సం
గ్రామమునం జయంబుఁగొని కౌరవ పాండవులందు వీరొ వా
రో మము సౌఖ్యమిచ్చుచును బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్