పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పద్మశ్రీ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ Ph.D

ఎం.పి (రాజ్య సభ)

ప్రశంస

శ్రీ కొప్పరపు సోదర కవులు, శ్రీ తిరుపతి వేంకట కవులు, శ్రీ వేంకట రామకృష్ణ కవులు, శ్రీ వేంకట పార్వతీశ్వర కవులు, శ్రీ పింగళి కాటూరి కవులు అవధానం, ఆశుకవిత్వం ధారా శుద్దితో చెప్పిన జంట కవులు. శ్రీ వేములవాడ భీమకవి, శ్రీనాధుడు, తెనాలి రామకృష్ణుడు మొదలయిన పూర్వకవులు కొన్ని చాటు పద్యాలను అశువుగా అలవోకగా చెప్పినప్పటికీ ఆధునికాంధ్ర భాషలో ఈ జంట కవుల అవధాన ప్రక్రియ ద్వారా తెలుగు కవితకు ప్రశస్తి ప్రాచుర్యాలు కలిగాయి. నేటి కాలంలో కూడా శ్రీ యుతులు మేడసాని, మాడుగుల అవధాన ప్రక్రియ జనామోదం పొందుతోంది.

శ్రీ యుతులు కొప్పరపు వేంకట సుబ్బరాయశర్మ, వేంకట రమణ శర్మ జంట కవుల అవధాన ప్రక్రియా వైశిష్ట్యం జనశ్రుతి ద్వారా, “కొప్పరపు సోదర కవులు' అనే ప్రస్తుత గ్రంథం ద్వారా; మనకు అవగత మవుతోంది. ఆనాడు టేపురికార్డులు, వీడియోలు లేని కారణంగా మనకు వారి ప్రతిభా పాటవాల్ని వీక్షించే అదృష్టం కలగలేదు. ఫలితంగా అనేక అవధానాది పద్య స్రవంతులు కాలసాగర గర్భంలో కలిసిపోయాయి.

కళాప్రపూర్ణ శ్రీ వేదము వేంకటరాయ శాస్త్రి, శ్రీ కొక్కొండ వేంకట రత్నము, శ్రీ వావిలకొలను సుబ్బారావు, శ్రీ వసురాయ కవీంద్రుడు, శ్రీ కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మునీంద్రులు, శ్రీ కాళ్లకూరి నారాయణ రావు, శ్రీ జయంతి రామయ్య పంతులు మొదలయిన అనేక సుప్రసిద్దాంధ్ర సంస్కృత పండితులు మన కొప్పరపు సోదర కవుల అవధాన కవితా సరస్వతీ దేవికి హారతులు పట్టిన వారే.

శ్రీ రాజా మంత్రి ప్రగడ భుజంగరావు బహద్దూర్ జమిందారు గారు శ్రీ కొప్పరపు కవుల ఆశుకవితాధురీణతకు మెచ్చి 1913లోనే “ఆశుకవి శిఖామణి” బిరుదుతో సత్కరించారు. బాలసరస్వతి, ఆశుకవీంద్ర సింహ, ఆశుకవి సమ్రాట్,