పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

77

14. గోలకొండ, పూలదండ, కొత్తకుండ, మాలముండ అను పదములు వచ్చునట్లు రామాయణ కథ

నీనాథుండన గోలకొండపయి నెంతేనుండు నవ్వారితో
నీ నాఁడంబుధి దాఁటివచ్చు టెఱుఁగండేమందు నా రాఘవో
ర్వీనుండిప్డెద పూలదండ పయిఁబైరేకొత్తకుండంగ గె
ల్పూనన్ రామనమాలముండ దనుటెట్లో తెల్పుమండోదరీ!

15. పుల్లివిస్తరాకు

అన్నముం బుల్సు మజ్జిగ యాదిగల్గు
నవిభుజించి యనంతరం బందుఁబాఱ
వైచువిస్తరి యెండఁగావచ్చును పులి
యా కనెడునామ మద్దాని కర్హమగుచు

16. లవంగము

కారంబుగల్గి సౌఖ్యము సంఘటించుచు
        నెద్ది ప్రసిద్ధితో నెసఁగినదియొ
పైత్యదోషంబులఁ బాపు సమర్థత
        నెద్దిప్రసిద్ధితో నెసఁగినదియొ
తాంబూలమొనరింపఁ దగువస్తువులలోన
        నెద్దిప్రసిద్దితో నెసఁగినదియొ
దుర్గంధములనెల్లఁ దొలగించు లీలల
        నెద్దిప్రసిద్ధితో నెసఁగినదియొ

అయ్యది లవంగమనునది యబ్జగంధు
లెందఱోకర్ణ భూషగా నిచ్చగింతు
రెన్నియో యౌషధంబుల కిడు సహాయ
మది ప్రతిమనుష్యుఁ డార్జింపనగును జుమ్ము