పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
76

11. వృద్ధునకు బాలునకుఁ బోలిక

ఒరుల సహాయముండవలె నొప్పుగ వానికి వీని కెయ్యెడన్
గరచరణాదులున్న నధికంబగు లాభములేదు మాటనే
ర్పరి తనమింతలేదు మఱివానికి వీనికి నట్లుగావునన్
సరిగను బాలువృద్ధుని నిజంబుగఁ బోల్పఁగవచ్చు మిత్రుఁడా.

12. అవసరమైనప్పు డొరునిదేవిరించి, అవసరములేనపు డెన్నండు నతనిఁజూడనివానివలె నటించువాఁడెట్టివాఁడనుటకు

అబ్బినచో సిగ నబ్బకుండినం గాళ్లుఁ
          బట్టఁగాఁదలపోయువాఁడుగాక
యొక వేళఁదల్లి వేఱొకవేళ నాలని
          పలుకంగఁ దలపోయువాఁడుగాక
తండ్రియెవ్వఁడునాకు దైవమెవ్వఁడటంచుఁ
          బలుకంగఁ దలపోయువాఁడుగాక
పాపంబు ననృత మాభరణంబులుగ నెంచి
          పలుకంగందలపోయువాఁడు గాక

తనకుఁ దఱి యబ్బినపుడు పాదములుపట్టి
వానికబ్బిన నేయూరివాఁడవనుచు
నడుగ నేర్చునె యన్యుఁడైనట్టివాఁడు
నిర్భయంబైన తనశక్తి నిగ్గుదేర.

13. నాటకములు చూచుటవలని లాభనష్టములు

వనితల్ పూరుషులున్ మనోభవ కళావైదుష్యముల్ చూపుచోఁ
గనుటన్ దద్గత చేష్టలం దొరయు సుత్కంరన్ గడుం గీడగున్
ఘనులౌ వారి సువృత్తముల్ గనుట విజ్ఞానంబు ప్రాప్తించుఁ గా
వుననే నాటకమున్ గనుంగొనిన ముప్పున్ మెప్పుచేకూరెడున్.