పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75

8. నాటకశాలయందుఁగల యొక తెఱవర్ణన

మత్తేభంబులు లోచనంబులకు నమ్మత్తేభపున్ వాంఛలన్
హత్తంజేయఁగ సర్పసంతతులు భీమాకారముల్ దాల్చియే
చిత్తంబుం బటుసర్పభీతిననుపన్ జిత్రించి యింకెన్నియో
నృత్తాగారమునం దెసంగు తెఱపై నిర్మించినా రద్దిరే

9. విద్యవలన లాభము

పరదేశ సంచార పరులైన వారికి
        విద్య రైల్బండియై వెలయుచుండు
గృహమేధి సద్ధర్మ మహితులౌ వారికి
        విద్యయే విభవాభివృద్ధిఁ గూర్చుఁ
బలురాచ మన్ననల్ వడయు వారికి విద్య
        యే వశ్యమంత్రమై యింపొసంగుఁ
జలముతో వైరుల సాధించువారికి
        విద్య బ్రహ్మాస్త్రమై విజయ మొసఁగు

యశమునకు విద్యయే మేటి యవసధంబు
పరమునకు విద్యయే మంచి పట్టుఁగొమ్మ
పాపగిరులకు విద్యయే వజ్రధార
యట్టి విద్యాధిదేవత నభినుతింతు.

10. రక్తంబంచును నిర్మలోదకమునుం ద్రావంగ శంకించెఁదాన్‌

రక్తాంభోజ సమాన పాణియగుచున్ రంజిల్లు బింబోష్ఠి ధీ
శక్తుల్లేమిని ముగ్ధ గావునఁ బిపాసాయాసముం దీర్ప నా
సక్తిన్ దోసిట బట్టి కేలుగవఁ గెంజాయల్ విడంబింపఁగా
రక్తంబంచును నిర్మలోదకమునుం ద్రావంగ శంకించెఁదాన్