పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
74

నెమ్మి సువర్ణంబు నిర్మించుటను జేసి
        యల శమంతక రత్న మనఁగవచ్చు
నీలోదకంబుచే నెగడు చుండుటఁజేసి
        యల యమునానది యనఁగవచ్చు
మంచి చెడ్డలనొక్క మాడ్కి నుండుటఁజేసి
        యాత్మార్థ విజ్ఞాని యనఁగవచ్చు

కాగితములను నదులపైఁ గ్రాలు చుంటఁ
గల మనఁగవచ్చుఁ గాన నీకలము మహిమ
మిట్టిదని వర్ణన మొనర్ప నెవరితరము?
రమ్య కారుణ్యగుణసాంద్ర! రామచంద్ర!!

5. ప్రస్తుత శతావధానమును గుఱించి

ధీరాగ్రేసరులైన పృచ్ఛకుల కెంతేఁగోరు వృత్తంబులున్
ఘోరంబుల్ సుకరంబులౌ విషయముల్ కూర్పొప్పఁగాఁజేసిమేల్
ధారన్ ధారణఁజూపిమెచ్చుఁగొన స్వాంతంబందునన్ గోర్కె చే
కూరన్ జేయుచునుంటి నేఁడుసభ నీగుంటూరిలోఁ జూడుమీ

6. చల్లగాలి, చలిగాలి భేదము

మలయ పవమాన మెంతయు
చలిఁజేయదుకాని హృదయసౌఖ్యంబిడు నీ
చలికాలపు పవమానము
చలిచేయుటెకాక హృదయసౌఖ్యం బడఁచున్

7. చాకు

అవసరంబుగల్గి నప్పుడెయ్యదియైనఁ
జెక్కుటకునువీలు చెందునెద్ది
దంతపుటొఱ గల్గి తళ్కుతళ్కను నద్ది
చొక్కమైన యట్టి యుక్కు చాకు.