పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

63

భళిభళీ! యౌర! దైవాంశ వలనవీరు
పుట్టినప్పుడె కవులౌచు బుధులునగుచు
వఱలినా రన్యమెంచుట వట్టివెఱ్ఱి
ధర ననన్యధీజవులు కొప్పరపుఁ గవులు.

శ్రీమత్కొప్పర వంశపావనయశశ్స్రీభ్రాతృయుగ్మంబ!యా
సోమార్కంబు భవద్యశంబధికమై శోభిల్లుతన్ ధాత్రిమీ
నామంబుల్ వినినంత మాత్రమున నున్మత్తస్థితింజెందిపో
రే మీశత్రులు మత్సరత్వమునకున్ హృత్సీమఁజోటిచ్చినన్

బ్రహ్మశ్రీ పుట్రేపు శేషయ్యగారు

గంగాప్రవాహ భంగప్రచారంబు మీ
         యాశుధారా కవిత్వాతిశయము
పూషాంశుకాండ విస్ఫురణాసమంబు మీ
         యాశుధారా కవిత్వాతిశయము
జంఝానిలాటోప సంరంభయుతము మీ
         యాశుధారా కవిత్వాతిశయము
గాండీవిహస్తనిర్గళితాస్త్రధార మీ
         యాశుధారా కవిత్వాతిశయము

నిర్మలము నిష్కళంకము నిరుపమాన
మై యొసంగెను మీ కవిత్వాతిశయము
గాన మిమ్మెన్న నేరుపు గలదె నాకు
సూరిహితులార! సోదర సుకవులార!!

ఆశుకవిత్వసంపద కహాయని మెచ్చనియట్టివారు మీ
పేశల వాక్సుధామహిమపెంపు నుతింపనియట్టివార లీ
చేసిన మేల్ వధానము ప్రసిద్ధమటంచు గణింపనట్టి వా
రీ సభఁగాన రారు సుకవీశ్వరులార! రసజ్ఞులౌటచే.