పుట:Kopparapu-soodara-kavula-kavitvamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

59

జరుపఁగ నేర్చినానయిన సత్యముగా భవదీయ ధారణా
గరిమను జూచి సిగ్గుపడఁగావలసెన్ మొలచెన్ భయంబెదన్

అవధానంబునఁ బూర్తిచేయఁగ నసాధ్యంబై గభీరార్ధశ
బ్దవితానంబయి యన్యదుర్లభమునై భాసిల్లు నీదుస్సమ
స్య విలాసంబుగఁ బూర్తిచేసితివి నీసామర్ధ్యమెన్నంగ నా
కవునే వేంకటసుబ్బరాయ కవివర్యా! యార్యలోకస్తుతా!

శ్రీమాన్ తిరుపతి రంగాచార్యులవారు

శ్రీమత్కొప్పరపు బుధ
స్వాములకున్ సోదరులకు సరసులకు యశో
ధాముల కవధాన కవి
గ్రామణులకు రాముఁడిచ్చుఁగాత శుభంబుల్

గంగాభంగతరంగ ఘుంఘుమరవోద్గాఢ ప్రసంగంబులన్
గాంగేయోగ్రరణధ్వనత్కర ధనుర్ఘంటా విలాసంబులన్
రంగత్పద్మభవాంగనాంఘ్రి కటకారావప్రభావంబులన్
మ్రింగున్ మీ కవితా మహామహిమ నెమ్మి న్నమ్మివర్ణింపఁగన్

పాయసంబున నుప్పు లోపంబటంచుఁ
గోడి నడినెత్తి పైమూఁడు కొమ్ములనుచుఁ
బలుకువా రీర్ష్య నెట్టులోఁ బలుక నేమి
మిమ్ము నిష్పక్ష పాతులు మెచ్చినారు

ధారణకు మెచ్చితిని మీ
ధోరణికిన్ మెచ్చితిని బుధుల్ కవులు నృపుల్
మీరాక కెదురుచూచుచు
గౌరవ మిచ్చెదరుసుండి కవిమణులారా!