పుట:Kondaveeti Charitramu Maddulapalli Gurubrahmasarma 1907.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

అవతారిక.


అఖండ మహీమండల మండనాయమానంబగు హిందూభూమండలము బహుకాలమునుండి భగవదంశ సంభూతులగు పెక్కుమంది నృపతల్లజులచేఁ బాలింపఁబడుచున్నది. అట్టివారిలోఁ గలియుగాదివరకుఁ గల రాజులనుగూర్చి పూర్వమున వేదవ్యాసుండు పురాణరూపకముగ వివరించి యున్నాడు. అందు కాలనిర్ణయాదులు లేకున్ననవియెల్ల నెల్లఱకు నిహపరసాధనోపాయములును నీతిభోదకములునై యున్నవి. తదుపరి గల రాజన్యుల వృత్తాంతముల నెవరును బ్రకటింపమి నవియెఱుంగ దుస్తరము. అయిన నీ కాలమున మహాఘనతజెందిన యాంగ్లేయప్రభువుల కృపాతిశయమున రమారమి 1000 సంవత్సరములనుండి గల హిందూ భూపతుల చరిత్రములు బయలుపడి ప్రసిద్ధినొందియున్నవి. ఇది యెంతయు సంతసనీయము. అయినను మనదేశీయులకు చరిత్రాదులు వ్రాయునాచరము బొత్తుగా లేనేలేదని నిరాకరించుటకు వలనుపడదు. ఎట్లనిన మనదేశమునఁ గొన్నికొన్ని స్థలములందు దండికవిలెలు (దేశచరిత్రములు) పూర్వులు వ్రాసియుంచినట్లును అందుఁ గొన్నికొన్ని వివిధకారణములచే నశించుచున్నట్లును వినుచున్నారము. ఇట్లగుటకు కారణమేనున “శ్లో॥ పుస్తకంవనితా విత్తం పరహస్తంగతంగతం, ఆధవాపునరాయాతం జీర్ణంభట్టాచఖండశః." అను లోకప్రతీతిని మదినిడిని మిగులభీత చేతస్కులై సంగతి సంతర్మములఁ గనిపెట్టకఁ దమకడఁగల పురాతన గ్రంథములఁ బరులకీయకను, భద్రపరుచు నూహ లెఱుంగకను ప్రచురించినచోఁ దమకడ గ్రంథములుండినపుడుండు గౌరవము గ్రంథములులేకుండినఁ దగ్గగుననియును మొదలగు వెఱ్ఱితలంపులచే మనవారిలోఁ గొందరు పూర్వనిర్మితములగు బహుగ్రంథములను స్వేతపిపీలిక పావకాదుల కర్పించుచున్నారు. ఇది మిక్కిలి చింత్యముకా