పుట:Kondaveeti Charitramu Maddulapalli Gurubrahmasarma 1907.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

v

వత్తము. ఇందలికాల సంఖ్యలన్నియు శాలివాహన శకవత్సరములఁ దెలుపఁబడినవి. దీనికి 78 కలిపిన హూణశకవర్షము తెలియును. ఇందు ప్రథమాశ్వాసమున నీకొండవీడే విదర్భదేశ ముఖ్య పట్టణమగు కుండినమనియు నిందు భీమభూపాలుడును భీష్మకుడును ప్రభుత్వ మొనర్చిరనియు దమయంతికిని రుక్మిణికిని జన్మస్థానమనియు వ్రాయబడినది. ఇది సంశయా స్పదవిషయమైయున్నది. ఎట్లనిన హైదరాబాదునకు నుత్తరమునగల బీడర్ దేశమే విదర్భయనియు దానికి ముఖ్యపట్టణము కుండినముగలదనియు “Madras Manual of the Administration” ను బట్టియు మఱికొన్ని నిదర్శనములనుబట్టియు కనుపట్టుచున్నది. ఈకొండవీడు త్రిలింగక్షేత్ర (ఆంధ్ర మండలము) మధ్యనుండుటంచేసి యిది కుండినము కాదనుటకు సందియముండదు కాని యిది కుండినమని లోకప్రతీతిమాత్రము చిరకాలమునుండి వచ్చుచుండుటయే కాక పెక్కు దండకవిలెలలందును వ్రాసియున్నది. గ్రంథకర్త యీనిదర్శనముల కొప్పుకొనుచూఁ దానుజేకొనిన మాతృకయందుండుటచే నిట్లు వ్రాసితినని చెప్పుచున్నాడు గాన నీవిషయమున నీకవి యాక్షేపణార్హుడుకాడని నాయభిప్రాయము. ఇది మనదేశమున ఒహుకాలము ప్రభుత్వసామ్రాజ్యమువడసి మిన్నయగు వన్నె కెక్కిన కొండవీటి చరిత్రమగుట వినవినదేశ్యులకు నుత్సాహకరముగాను నానందప్రదము గాను నుండకమానదు, కావున నెల్లరును స్వదేశ చరిత్రాభిమానమును వహించి మనకడనశింపుచున్న చరిత్రములను బయలుపఱపించి దేశౌన్నత్యమును ప్రకటింపనియ్యకొని పూర్వుల పరిశ్రమల నిరర్థకములుగాకుండ చేయుదురని కోరుచున్నాను.

ఇట్లు, సుజనవిధేయుడు,
గబ్బిట లక్ష్మీనరసింహం,
హెడ్‌క్లర్కు,
పల్నాడు తాలూకా.

గురిజాల
1-10-1906.