పుట:Kondaveeti Charitramu Maddulapalli Gurubrahmasarma 1907.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv

దే. ఆంగ్లేయ ప్రచురిత చరిత్రాదులందు విస్తరించి యుత్తర హిందూస్తా ప్రభువులనుదక్క దక్షిణహిందూస్తాన పాలకులఁగూర్చి చెప్పబడకుండట, మధ్యదేశ్యులు దమపూర్వప్రభుచరిత్ర లెఱుంగ నిచ్చగలిగి యాంగ్లేయ ప్రచురిత చరిత్రలకు మిక్కుటము తృప్తినొందకుందురని తోచెడిసి ఇట్లుండ 1898 సం॥ ప్రాంతములందు గుంటూరు మండలములోని నర్సారావుపేటకు రాజకీయోద్యోగము (డిప్యూటి కలెక్టరు) వహించియరుదెంచిన బ్ర-మ-రా-రా-శ్రీ జయంతి రామయ్య పంతులు (బి.ఏ., బి.ఎల్.) గారి యనుకంపచేఁ బ్రాచీనములై యంతరువులుపడి మూలలడాగియున్న చరిత్రములలో కొన్ని బయలుపడినవి. ఇందువలన మనకు మనదేశ ఘనత నెఱుగ నవకాశముగలిగినది. ఇందులకు మనమెల్లరము కృతజ్ఞులమై యున్నారము. ఆ కాలమున గుంటూరుజిల్లా వినుకొండతాలూకా తిమ్మాపురాగ్రహారపతులగు బ్ర-మ-రా-రా-శ్రీ భాస్కరుని సీతారామయ్య, గోపాలరాయుడు గార్ల వలన నొసంగబడిన యీకొండవీటి చరిత్రము "కొండవీటి కైఫియ్యతు” అనుపేర తెలుగువచనమున కాలనిర్నయములతో వ్రాయబడియున్నది. దీనిని మేమెల్లరముగాంచి సంతసించితిమి. ఇది పద్యకావ్య రూపకముగనుండిన మేలని స్నేహితులుసెప్ప వినుకొండ నివాసియగు మద్దులపల్లి గురుబ్రహ్మ శర్మసుగమమగు శైలిని ననవసరవర్నన కల్పనాదులు చేర్చక వచనకావ్యగత చరిత్రము మాత్రము నాలుగాశ్వాములుగ వ్రాసెను. ఈగ్రంథకర్త శ్రమించి విస్తరము చదువకపోయినను బుద్ధికుశలత చేతను, సాంగత్యోపయోగము చేతను కొంతపాండిత్యమును సంపాదించి యీగ్రంథమును వ్రాసెను. ఈయన సాహిత్యమునందుగాక సంగీతమునందును కొంత ప్రవీణతఁబడసి స్వయముగాఁ బాడనేర్చి ధ్రువోపాఖ్యానమును, గజేంద్రమోక్షణంబును యక్ష గానరూపకముగ (హరికథ శైలిని) వ్రాసినాడు. కావ్యదోషాదోషములఁగూర్చి విమర్శింతమన్నచో "కాళిదాసమయూరాది కవులకైనఁగలవు. తప్పులనంగనన్యులకులేవె" అని కాకు నూర్యప్పకవిగారు నుడివినరీతి నెల్లరకును నేదియో యొకలోపమైన నుండకపోదు గాన నావిషయముకు కవులకువదలి యిక చరితాంశమునకు