పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/93

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


టులుగావించి సిద్ధముగా నుండిరిగాన వివాహము చక్కగనే జరిగిపోయెను.

ఇట్లు కొంతకాలము జరిగినపిమ్మట వీరికి కొన్ని వ్యవహారపు జిక్కులు సంభవించినవి. గాజుల లక్ష్మీనరసింహచెట్టిగారు వీరిమీద నలుబదివేలరూపాయలకు మదరాసుహైకోర్టులో దావాతెచ్చి డిక్రీపొందినారు. వీరు దానిని తప్పించుకొనుటకు కొన్ని అవకతవకపనులు గావించినారు. తండ్రికొడుకులు విడిపోయినట్లు ఏర్పరచి, కోదండరామయ్యగారివంతుకు వచ్చిన ఆస్తిలో కొన్నిభూము లితరులకు విక్రయాదులు జరిపించిరి. కొన్ని తనమామగారిపేరనే వ్రాసిరి. కొన్ని డిక్రీబాకీక్రింద అమ్మకమైపోయినవి. ఇట్లు భీభత్సమైనకాలముననే కోటయ్యగారు మృతినొందిరి. జప్తుతెచ్చిన కోర్టుజవానును కొట్టినట్లు కోదండరామయ్యగారిపై క్రిమినల్‌ఛార్జి వచ్చి అందులో సుమారు నెలరోజులు శిక్షబడుట సంభవించినది. జైలునుండి విడుదలయై వచ్చినతోడనే పక్షవాతమువలన మంచమెక్కి, అట్లు కొలదిసంవత్సరములు జీవించి, కోదండరామయ్యగారు మరణము నొందిరి. అంతకుముందు చాలకాలమునుండియు ఆయన మామగారితండ్రికుటుంబము వీరియింటిలోనే వీరిపోషణలోనే యుండిరి. ఆయనబావమరది సీతారామయ్య వ్యవహార దక్షుడై యింటి వ్యవహారముల బాధ్యత వహించి పనులు నడిపించుచుండెను. నా పెండ్లిసంబంధమును కుదుర్చుకొనుటకు మాయింటికి వచ్చినది యీ సీతారామయ్యగారే. నాపెండ్లినాటికి మా అత్తవారికి ఉన్న ఏడరకలవ్యవసాయమును ఈయనే నడిపించుచుండెను.