పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరకునని ఆశతో ఒకరిద్దరు పోయిరి. మాకు వంటచేయుటకు ఒప్పుకొనిన ఆమె కాలువలో స్నానముచేసివచ్చునప్పటికి తోటలో నొకచోటస్థలము బాగుచేసి పొయ్యినమర్చి నిప్పు రాజబెట్టుడని ఆమె కోరినందున మేము రాళ్ళుతెచ్చి వానిని పొయిగా నమర్చి పుల్లలు వెతకికొనివచ్చి పొయిలో నుంచి నిప్పుపెట్టెలో పుల్లగీచి ముట్టించునప్పటికి పుల్లలు కాలుటయే గాక పొయిక్రిందను దానిచుట్టును నేలమీదనున్న సరుగుచెట్ల ఆకుమొదలగునవి భగ్గునమండి మంట నలుప్రక్కల బ్రాకనారంభించెను. అంతట చుట్టునున్న తుక్కును వెనుకకు నెట్టి మంట ప్రాకనీయకుండ చేసి మరల ఆ దుగ్గేమియు లేకుండ తీసివేసిన నేలపై పొయి నమర్చితిమి. తోట అంతట సుమారు అరగజము ఎత్తున పడియున్న సరుగుచెట్లఆకు అలము సులభముగ రవులుకొనిపోవుననుమాట గుర్తించక ఆదుగ్గుమీదనే పొయిపెట్టుట వలన ఈ యుదంతము సంభవించెను. కాని దైవానుగ్రహము వలన ఆమంటలు ప్రాకకుండచేయగలిగితిమని సంతసించితిమి. కూరలు మొదలగునవి తేవలెనని దగ్గరిగ్రామమునకు బోయినవారు ఉప్పుమాత్రము తెచ్చిరి. తక్కినవేవియు దొరకలేదు. కనుక ఏ మూడుగంటలకో పచ్చిపులుసుతో అన్నముతిని అంతట పడవనెక్కి ప్రయాణముచేసితిమి.

మాతోడ నొక వైష్ణవాచారిగూడ ప్రయాణము చేయుచుండెను. ఆయన ఆతోటలోనే చుట్టును గుడ్డలుకట్టి రహస్యస్థానము నేర్పరచుకొని కాలవలో స్నానముచేసి తిరునామములు దిద్ది, దడిలోపల సుఖముగ భుజించి మావంట పారంభ