పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పడవ ప్రయాణము

మేము బి. ఏ. మొదటితరగతిలో చదువుచుండగనో ఎఫ్. ఏ. చదువుకాలములోనో ఒక్కవేసవిసెలవులలో కళాశాల మూయుటతోడనే బకింగుహాముకాలవ అను చెన్నపట్టణపు కాలవపై పడవలమీద చేబ్రోలుచేరి, అక్కడనుండి గుంటూరు చేరవచ్చునని యోచనచేసి పడవవారిని అడుగగా వారము రోజులలో వెళ్ళవచ్చునని వారు చెప్పినందున కొందరు విద్యార్థులము కలసి పడవనెక్కి ప్రయాణముచేసితిమి. (Lake Pulicut) ప్రళయకావేరి యని పిలువబడు ఉప్పునీటిమడుగును పడవదాటి పోయిన కొలది దినములనుండి మాకు ఈ ప్రయాణములో కష్టములు ప్రారంభమైనవి. వెంట తెచ్చుకొన్న లడ్లు, కారపుబూంది మొదలగునవి తినివేసితిమి. మాపడవలోనే యొక బ్రాహ్మణ వితంతువును ఆమెకుమారు డొకబాలుడును ప్రయాణము చేయుచుండిరి. ఆమె చాల బీదరాలు. ఆమె మాకు ప్రతిదినమును వండిపెట్టునట్లును మాకును ఆమెకును ఆమెకుమారునకును కావలసిన బియ్యము మొదలగు భోజనద్రవ్యము మేము తెచ్చి యిచ్చునట్లును ఏర్పాటు చేసుకొంటిమి. మే మెక్కినపడవగాక మరికొన్ని పడవలుగూడ మాపడవతోడనే ప్రయాణముచేయుచుండెను. ప్రళయకావేరి దాటినతర్వాత నొక మధ్యాహ్నమున నొక సరుగుతోటయొద్ద పడవలు ఆపివేసి, సమీపమున పల్లెలో కలాసులు వారివారి బసలకు భోజనమునకు బోయిరి. మేము తెచ్చుకొన్న బియ్యము మా కందరికి కావలసినవి కొలిచి ఆమె కిచ్చితిమి. సమీపగ్రామములో ఉప్పు, గూరగాయలు, మజ్జిగ