పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/78

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అడుగుచెక్కను మరల మరమేకులతోనే బిగించి, జడ్జి వేసినసీళ్లు చెడకుండ భద్రముగ నుంచెను. మరునాడు జడ్జి ఆపెట్టెను తెప్పించి తాళముతెరిపించి చూడగా తీర్పు వీరేశలింగముగారు చెప్పినప్రకారముగా గాక ఎదిరిపక్షముగనే వ్రాయబడియుండెను. వీరేశలింగముగారు మునసబు లంచము పుచ్చుకొనెననిచెప్పుటయే అన్యాయమైనట్లు ఏర్పడినది. పెట్టె అడుగుచెక్కను విప్పి ప్రాతతీర్పు చించివేసి క్రొత్తతీర్పు వ్రాసిపెట్టె ననుమాట పంతులు గారికి తెలియవచ్చినది. కాని యిది రుజువుపఱచుట అసాధ్యముగనేయుండెను. వారు నెమ్మదిగ యోచనచేసి, మునసబుగారి యింటిలో పనిచేయు పనికత్తెను పిలిపించి మునసబుగారి ఆఫీసు గది ప్రక్కను పారవేసియున్న కాగితపుముక్కల నన్నిటిని ప్రోవుచేసి తెప్పించిరి. వాని నన్నిటిని జాగ్రత్తగ చదివి అందలిఅక్షరములను సందర్భోచితముగ పదములుగ కూర్చి పదములను వాక్యములుగ జేర్చి మొత్తమున మొదటవ్రాసిన తీర్పు మరల రూపమెత్తించెను. ఈ ముక్కల నొకదానితో నొకటి అంటించి దానిని జడ్జిగారియొద్దకు గొనిపోయి చూపించెను. అది అంతయు మునసబు స్వహస్తముతో వ్రాసినదగుటచే మునసబుచేసిన దురంతమంతయు స్పష్టమయ్యెను. ఈవిషయమును విని, మునసబు ఆత్మహత్యచేసుకొని రాజదండన తప్పించుకొనెను. వీరేశలింగముగారి వాక్యముల సత్యము నిర్ధారణయగుటయేగాక అక్షరముల గూర్చువిద్యయందు వారికిగల ప్రావీణ్యము తేటపడెను. మరియు వారు దుర్మార్గులగు ప్రభుత్వోద్యోగులకు సింహస్వప్నముగ నుండిరి. వారి ప్రభావము దేశమున ఎల్లెడల వ్యాపించెను.