పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/76

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పురషోత్తము అను మరియొక ఆంధ్రవిద్వాంసులు నుండిరి. ఈపండితులకును వీరేశలింగము పంతులుగారికిని భాషావిషయకమైన వాదప్రతివాదములు తీవ్రముగ జరుగుచుండెను. ఇవి పత్రికలలో ప్రకటితము లగుచుండెను. ప్రభుత్వోద్యోగులు చేయు అక్రమములు వివేకవర్థనిలో నిర్భయముగ విమర్శింపబడుచుండెను. సాంఘికదురాచారములును నైష్ఠికులమని పేరుపెట్టుకొన్నవారు కొందరు సమాజమున జరుపుచుండు దుశ్చేష్టలును బట్టబయిలు చేయబడుచుండెను. బాల వితంతువుల వైధన్యమువలన కలుగుచున్న యనర్థములు వివరింపబడుచుండెను. స్త్రీ పునర్వివాహములు వీరేశలింగముపంతులుగారు జరిపి, సంఘబహిష్కారమునకు పాత్రులై కష్టములపాలగుచుండుటచేత దేశమున ఈసంఘ సంస్కరణమునుగూర్చి గొప్పకలవరము సాగెను. ఆంగ్లేయవిద్యాధికులలో గొందరు సంఘసంస్కరణాభిమాను లేర్పడిరిగాని తక్కినవా రీ సంస్కరణపట్ల మిక్కిలి విముఖులైయుండిరి. మరియు ఆంగ్లేయవిద్యాధికులగు న్యాయవాదులకును ధనికులగు వైశ్యులు మొదలగువారికిని భోగముసానులతో బహిరంగసంబంధము లుండెను. పలువురు దానిని వారి గొప్పస్థితికి తగిననడవడిగ పరిగణించుచుండిరి. భోగముబాలికలు వ్యక్తురాండ్రగుటతోడనే కన్నెరికముపెట్టుట యొకగొప్పకార్యముగ ప్రజలు పరిగణించు దుస్థితి సంఘమున నేర్పడెను.

ఇట్లు దేశమున నడచుచున్న దుష్కార్యములును దురాచారములును బయటపెట్టుటకు వీరేశలింగముగారు మిక్కిలి వినోదములగు చిన్నకధలను కల్పించి, ప్రహసనములు వ్రాసి