పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వచ్చినతోడనే పోయి తల్లిని బిడ్డనుచూడవలెనని ఆతురపడుచుండెను. ఆసమయమున నే నీపద్యమును

        అనుపమనిత్యసత్యవ్రత యంబుజలోచన కృష్ణవేణి ప్రా
        గ్వనిత యుదీర్ణతేజు రవి గాంచినయట్టుల దాను పుత్రునిన్
        గనె ననువార్త వీనుల కనంతము విందులుసేయుచుండగా
        మనమలరార జూచుటకు మాటికి కోరిక లీరికల్‌గొనెన్.

వ్రాసి అతని యాతురత వర్ణనచేసితిని. ఇదియే నేను నాజీవితమున వ్రాసిన మొట్టమొదటి పద్యము. తప్పులతడకయే యగును గాని నాకు పద్యములందుగల యభిరుచి కొంత కన్పడుచున్నదని చెప్పవచ్చును. ఆరోజులలో ముక్కుతిమ్మన్న గారి పారిజాతాపహరణమునం దెక్కువ యభిమానముండుటచేత దానియందలి కొన్ని పద్యములను కంఠస్థముచేసుకొని పాడుకొనుచుండెడివాడను. మరియు ఆకాలములో సంగీతమనిన నాకు ప్రేమ యధికముగ నుండెను. మావసతిగృహములో అరవదేశపువిద్యార్థులు పలువురుండిరి. వారిలో కొందరు కృతులుమొదలగునవి పాడుచుండిరి. వానిని వినుచుండుటయేగాని వారివలె పాడవలెనను పట్టుదల యేమియు లేకుండెను. తుదకు అరవభాషమాట్లాడుటకైన ప్రయత్నముచేయలేదు. అది వినుటకు కొంత కటువుగానుండుటచేత దానిపై బుద్ధిపోలేదు. ఆకాలమున దక్షిణదేశమున మిక్కిలి ప్రసిద్ధిగాంచిన సంగీతవిద్వాంసు లొకరు అప్పుడపుడు చెన్నపట్టణమునందు ధనాధికులయిండ్లలో పాడుచుండెడివారు. వారి గానము రెండుమూడుసారులు నేను వినుటకు బోయియుంటిని. వారిపాట వినుటకు వేలకొలదిజనులు మూగుచుండిరి. వారి కంఠధ్వని మిక్కిలి మనోజ్ఞముగ నుండెను. హెచ్చుస్థాయిని