పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/65

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సిఫారసుఉత్తరము వ్రాసియియ్యవలసినదని కోరగా క్రైస్తవకళాశాలలో ఉపాధ్యాయుడుగానుండి అచ్చట పరస్థలమునుండి వచ్చిన విద్యార్థుల భోజనాదివసతులను చూచుచుండు డబ్లియు. రామయ్యగా రనువారికి మమ్మునుగూర్చి సిఫారసుఉత్తరము ప్రేమతో వ్రాసియిచ్చిరి. అది తీసుకొని మేము కాకినాడలో ఎల్లోరా యను స్టీమరు నెక్కి చెన్నపట్టణమునకు పయనమైతిమి. ప్రొద్దుననే భోజనముచేసి బయలుదేరితిమి. సముద్రములో దాదాపు ఆరుమైళ్లదూరమున లోతునీళ్లలో స్టీమరు నిలచి యుండెను. కాన స్టీమరు నెక్కుటకు సముద్రములో చిన్నపడవల మీద పోవలసియుండెను. ఆపడవలనెక్కి కొంచెముదూరము పోవునప్పటికి నాకు ఒడలుత్రిప్పి డోకులు ప్రారంభమయ్యెను. ఎట్లో ప్రయాసతో స్టీమరు అందుకొని దానిపై టాపుమీద అనగా 'డెక్‌' మీదకు చేరితిమి. నాకు వమనము లెక్కువ అగుచుండుటచేత చాల బాధగానుండెను. ఆరోజంతయు ఆస్థితిలోనే యుంటిని. మరునాడు స్టీమరు బందరు రేవు చేరునప్పటికి డోకులు కొంత తగ్గుటచేత మిత్రులతో మాటలాడుటకు అవకాశము కలిగెను. నంబూరు తిరునారాయణస్వామి అనుమిత్రుడు మాతో రాజమహేంద్రవరమున మెట్రిక్యులేషన్ పరీక్షనిచ్చినవారిలో నొకడు. మేము చెన్నపట్టణమునకు బోవుటకు ముందుగ మాతోవచ్చి కలుసుకొనెను. అతనికిగాని హనుమంతురావుకుగాని ఈ ఒడలుత్రిప్పుట లేక సుఖముగనేయుండిరి. గుంటూరులో నుపాధ్యాయుడుగా నుండిన శ్రీఅభిరామయ్యరు అను నొక అరవబ్రాహ్మణుడు కొంత వయస్సుచెల్లినవాడు మాతో స్టీమరులో 'డెక్‌' మీదనే ప్రయాణికుడుగానుండెను. మేము సాహసించి