పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/64

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పరిచయము లేకపోయెను. ఇళ్లువదలి ఇతరగ్రామములో నివసించుట మాకు క్రొత్తయగుటచేతను చదువునందు శ్రద్ధ తక్కువగుటచేతను ముచ్చటగ తిరుగుచు కాలము గడపుటకు అభ్యాసపడితిమి. ముఖ్యముగా చెన్నపట్టణములో చదువవలెనను అభిలాష మొదటినుండి హెచ్చుగానుండుటచేత రాజమహేంద్రవరములో చదువుపై లక్ష్యములేకపోవుటవలన పాఠములు పట్టుపడలేదు. కాని ఏమో పెద్దక్లాసులో చదువుచున్నామని గర్వము మమ్ముల ఆవహించెనని చెప్పవచ్చును.

చెన్నపట్టణము - సంగీతసాహితులు

సంవత్సరాంతమున గుంటూరు నాటకసమాజమువారు రాజమహేంద్రవరములో నాటకప్రదర్శనము చేయుటకు వచ్చిరి గాన అందులో నాటకపాత్ర నేను వహింపవలసివచ్చెను. హరిశ్చంద్రనాటకమునకు పౌరులు మమ్ము హెచ్చుగా పొగడిరనితెలిపి యుంటిని. వారిలో అచ్చటి న్యాయవాదులలో ప్రముఖులుగా నుండిన మాకర్ల సుబ్బారావునాయుడుగారు నాయందెక్కువ అభిమానము వహించియుండిరి. ఈలోపల హనుమంతురావు, నేనును చెన్నపట్టణమున క్రైస్తవకళాశాలలో ప్రవేశించి చదువవలెనని నిశ్చయించుకొంటిమి. రాజమహేంద్రవరములో రెండవ సంవత్సరము చదువుటకై జీతముమొదలగువాని నిమిత్తము మా తండ్రుల నడిగి డబ్బు తెచ్చుకొని, శ్రీమాకర్ల సుబ్బారావు నాయుడుగారియొద్దకు బోయి, మేము చెన్నపట్టణ క్రైస్తవకళాశాలలో చదువనిశ్చయించుకొకొంటిమి గాన అచ్చట తగినవారికి