పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గలిగి యించుక లావుగా నుండుటచేత పొట్టిగానున్న ట్లగపడుచుండెను. షేక్‌స్పియర్ నాటకమును, గ్రీకు, రోమనుచరిత్రలును మాకు జెప్పుచుండెను. ఈయన చాల సత్స్వభావముకలిగి విద్యార్థులయెడ దయతో మెలంగుచు శ్రద్ధతో పాఠముల బోధించుచుండెను. కళాశాలను కట్టుదిట్టములతో నడిపించుచు విద్యార్థులను అదుపాజ్ఞలలో నుంచి వారి శ్రేయస్సును గోరుచుండెను. సాయంకాలము ఆటలలో బాలురతోగూడ పాల్గొనుచుండెడివాడు. ఒక్కొక్కప్పుడు బాలురను ఆయాటలలో తన వీపుపై నెక్కించుకొనుచుండెను. ఇందువలన విద్యార్థులు వారియెడ ప్రీతితో, భక్తితో మెలగుచుండిరి. పాఠములు బోధించు సమయమున సందర్భముల ననుసరించి అప్పుడప్పుడు చిన్నకధలను చెప్పి విద్యార్థులకు సంతసమును ఉత్సాహమును కల్పించుచుండెను. వీరినిగూర్చి ఒకకధ చెప్పుకొనుచుండిరి.

వీరు రాజమహేంద్రవరములో పడమర యూరివెలుపల ఇంచుకదూరమున నొక చిన్నతిప్పపై నున్నబంగాళాలో కాపురముండిరి. ఒక సెలవుదినమున ఆబంగాళా ప్రహరీగోడ పోయినచోట నొంటరిగనే తనచేతులతో మట్టిగలిపి రాళ్లువేసి పూడ్చుచుండెనట. ఆసమయమున ఆయనయొద్ద చదువుకొనిన ప్రాత విద్యార్థి, తహశీలుదారియుద్యోగమును పొందినపిదప ఆయన దర్శనమునకై పోయెనట. అప్పుడు మెట్‌కాఫ్‌గారు తాను చేయుచున్న మట్టిపని చేయుచునే ఆవిద్యార్థితో సంభాషణజరుపుచు ఇంచుక దూరముననున్న ఒకరాతిని అందియ్యమని ఆవిద్యార్థిని కోరెను. అంతట ఆ తహశీలుదారు తనతోవచ్చినజవానును