పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిక్కిలి దు:ఖింపసాగెను. నాతమ్ము లిరువురును ఏడువసాగిరి. నాకును ఇదంతయు భరించరాని దు:ఖముకల్పించెను. ఇంతలో నావిద్యాగురువులు మిక్కిలి గౌరవపాత్రులు అయిన కొండుభొట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారును మరికొందరు ఉపాధ్యాయులును మాయింటికి దయచేసి నన్ను ఏల ఈపనికి బూనితివని హెచ్చరించుచు నీకు క్రైస్తవమతము మిక్కిలి మంచిదని విశ్వాసము కలిగిన కలుగవచ్చును. మన హైందవమత మెట్టిదో విచారించితివా? ఏమియైన గ్రంథములను చదివితివా? పెద్దలతో ముచ్చటించితివా? మన పెద్దలంద రాచరించిన మత మెట్టిదో తెలుసుకొనకుండ పరమతమును స్వీకరించుట వెఱ్ఱితనముగాదా? నీ వింకను చిన్నవాడవు. ముందింకను మనశాస్త్రములను చదివి మనమతమునందలి గుణాగుణములు తెలుసుకొని పిమ్మట పరమతముసంగతి విచారించవచ్చునుగాని మనమతముసంగతి ఏమియు తెలియక అన్యమతములో కలియుట బొత్తుగా సరిగాదని వారు నాకు హితోపదేశముగావించిరి. ఈహితోపదేశమును దానికంటె నాతండ్రిగారియొక్కయు నాతమ్ములయొక్కయు దు:ఖతాపములు నామనస్సును త్రిప్పివేసెను. అప్పటికి క్రైస్తవమతములో ప్రవేశించుట మాని మనమతవిషయము ఆలోచించు కొనెదగాక యని మనస్సును శాంతింపచేసుకొంటిని.

మరునాడు అనుకొనినట్లు యూలుదొరగారియింటికి వెళ్లుటకు ముఖము చెల్లకుండెను. అంతగాఢముగ క్రైస్తవమతమునందు విశ్వాసముకలదని చెప్పిన నేను ఈనాడు ఆయనతో నేమని చెప్పగలనని తర్కించుకొనుచు వారియొద్దకు పోవుటమానితిని. కాని