పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


చగా నేను క్రైస్తవుడనుకావలెనని దృఢసంకల్పముతో వచ్చినానని చెప్పితిని. క్రైస్తవమతమునందు గాఢమగువిశ్వాసముకలదా యని ప్రశ్నించి, కలదు కలదని నేను గట్టిగ చెప్పినపిదప తాను మోకరించి, నాహృదయమున నిట్టిమార్పు కలిగించినందుకు దేవుని కృతజ్ఞతతో స్మరించుచు తమ మతమునందు నాకు విశ్వాసము మరింత కలుగజేయుమని ప్రార్థించెను. నేనును ఆయనతో కలసి ప్రార్థించితిని. యూలుదొరసానిగూడ ప్రార్థనలో పాల్గొనెను. కాని మధ్యమధ్య ఆమె నాజంధ్యము వెంటనే తీసివేయమని మిక్కిలి ఆతురతతో చెప్పుచుండెను, గాని యూలుదొరగారు ఆమెను తొందరించవలదని వారించి, క్రైస్తవమతమునందు నీ వింకను గాఢమగువిశ్వాసము కలుగనట్లు ప్రార్థించుము అని నాకు చెప్పై నన్నింటికి బోయి మరునాడు రమ్మని పంపివేసెను. ఇంతలో నెట్లో నేను క్రైస్తవమతములో కలియబోవుచున్నాననువార్త యూరంతట వ్యాపించెను. మాతండ్రి మిక్కిలి దు:ఖాక్రాంతుడై నే నెక్కడికి బోయినదియును తెలియక నానిమిత్తము ఊరిలో వెదకుచుండెను. నే నింటికి చేరునప్పటికి ఆయనయు చేరెను. నన్ను కూర్చుండబెట్టి నాతండ్రియు, నాతమ్ములును నాచుట్టును కూర్చుండి చింతాక్రాంతులై పరితపింపసాగిరి. "నాయనా! ఎప్పుడును నిన్ను నాప్రాణమునకు ప్రాణముగ జూచుకొనుచుంటిని. మీతల్లి పోయినదిమొదలు నీకొరకు నే నెన్నికష్టములు పడుచుంటినో నీ వెరుగవా? నీ కేమి కొరతగావించితిని? నీకొరకు నాప్రాణములనైన ఇచ్చుటకు సిద్ధముగనున్న నన్ను విడిచిపోయెదవా? ఈ చిన్నతమ్ములను విడనాడెదవా? ఎందుకు దేవుడు నీ కిట్టిబుద్ధి పుట్టించె"నని