పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/54

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రకారము నడిపించుటకు పూచీపడినయెడల నేను మందిచ్చెదనని నుడివినందున నే నందుకు సమ్మతించితిని. ఆమె ఔషధమిచ్చుట ఆనాడే ప్రారంభించెను. నిత్యమును రోగిస్థితిని తెలిపి, ఆమెవద్ద నుండి ఔషధము తెచ్చి, రోగి కిచ్చి, అది క్రమముగా నాతడు సేవించునట్లుచూచుచు ఆమె చెప్పినప్రకారము పథ్యపానములు అతనిబంధువులు జరుపునట్లు జాగ్రత్తతో పరికించుట నావిధిగా భావించితిని. ఇట్లొక్కనెల దినములపైకాలము ప్రాత:కాలము, సాయంసమయములందును తప్పక డాక్టరు కుగ్లరుగారి బంగళాకు పోయివచ్చుచు, ఆబంగళాలో ఆమెతో కలిసి నివాసముచేయుచున్న మరికొందరు మిషనరీలు వారి బాలబాలికలతో దినదినము సాయంకాలమున అందరునుగూడి దైవప్రార్థనలు జరుపుట చూచుచు, వారి సంభాషణలు వినుచు, కొంతవరకు క్రైస్తవ మతప్రభావమును పరికించగలితిని. అందు ముఖ్యముగ డాక్టరు కుగ్లరుదొరసానిగారి దైవభక్తియు, ఉదారస్వభావమును, త్యాగశీలమును నాహృదయమున క్రైస్తవమతముపై నభిమానము కల్పింపసాగెను. సాయంకాలము జరుపుచుండిన ప్రార్థనలలో వారితోకలిసి ప్రార్థనచేయుచుంటిని. ఇట్లు కొంతకాలము ఔషధసేవ చేయగా నామిత్రుడు చంద్రశేఖరము ఆరోగ్యవంతుడయ్యెను. ఇందువలన నా మనస్సున కెంతయు ఆనందముగలిగెను. డాక్టరుగారితో చెప్పినప్రకారము ఔషధసేవ మొదలగునవి జరిపించగలిగితినిగదా యని సంతుష్టినొందితిని. డాక్టరు కుగ్లరుగారును నాయెడ సదభిప్రాయము ప్రకటించుచుండిరి. నామిత్రునికొరకు ఔషధమునిమిత్తము ఆమైంటికి వచ్చుచు బోవుచున్న రోజులలో నొకదినము సాయంకాలము ప్రొద్దు