పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నొసంగుచుండిరి. స్త్రీలు పునర్వివాహముచేసుకొనుట తలిదండ్రులకుగాని బందుగులకుగాని తెలియకుండగనే నడిచిపోవుచుండెను. కాన ఆస్త్రీలను వారియిండ్లనుండి బయలుదేరతీసి రాజమహేంద్రవరములో శ్రీ పంతులవారియొద్దకు భద్రముగ గొనివచ్చి వారికి నొప్పజెప్పుటలో అతినైపుణ్యముతో కృషి చేయుచుండిరి. ఆ భీమశంకరముగారిని చూచినట్లు జ్ఞాపకము కలదు. ఈ ఉద్యమమును దూషించువారు ఇట్లు స్త్రీలను రహస్యముగ తీసికొనివచ్చుట గొప్పతప్పుగా భావించుచుండిరి. మరియు మేము అచ్చటికి వెళ్ళినది. డిశంబరుశలవురోజులగుటచేత కళాశాలయు, పాఠశాలలును మూసివేయబడియుండెను. రాజమహేంద్రవరముదగ్గర గోదావరి రమారమి ఆరుమైళ్ళ వెడల్పుగలిగి విశాలముగనుండుటచేత అది అఖండగోదావరియని పిలువబడుచున్నది. గోదావరిగట్టుపై నిలిచి చూచినయెడల ఆదృశ్యము నేత్రానందముగావించుచుండెను. ధవళేశ్వరముదగ్గర ఆనకట్ట అప్పుడు చూచినట్లు జ్ఞాపకములేదు. సారంగధరమెట్ట రాజమహేంద్రవరముదగ్గరనే యున్నట్లు తెలిసికొంటిమి. రాజమహేంద్రవరములో నున్నరోజులలోనే యొక్కనాటిరాత్రి శాస్త్రిగారిస్నేహితునియింట జంగము కోటయ్యగారు అను సంగీతవిద్వాంసుడు ఫిడేలువాయించి పలువుర నానందపరచెను. ఆయన బందరుకాపురస్థుడు. దక్షిణదేశముపోయి ఫిడేలు వాయించుటయు, పాడుటయు క్రొత్తగా నేర్చుకొని వచ్చి పాట కచ్చేరీలు చేయుచుండెను. అదియే ఆయనపాట మేము వినుటకు ప్రారంభము. అంతమాత్రముగ హృద్యమైనపాట అదివరకు మేము వినియుండలేదు. మరలివచ్చునపుడు తిరుగ ఏలూరులో