పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ చంద్రశేఖరము అనునతడు పాతగుంటూరులో అతని పెదతల్లిగారి యింటిలో భోజనముచేయుచు మాయింటిలోనే నిదురించుచు నాతో మిక్కిలి స్నేహముగ మెలగుచుండెను. అతనికి చదువుటకు పుస్తకములు లేకపోయినను నాపుస్తకములనే తీసికొని చదువుకొనుచుండెను. ఇతడు కొలదికాలము గవర్నమెంటుపాఠశాలలో చదివి పిమ్మట మిషన్‌పాఠశాలలో చేరెను. గవర్నమెంటుపాఠశాలలో నున్నపుడు హనుమంతురావుతో పరిచయమేర్పడెను. నంబూరి తిరునారాయణస్వామి యను మరియొకవిద్యార్థి పాతగుంటూరులో బందుగులయింటిలో నుండి గవర్నమెంటుపాఠశాలలో మెట్రిక్యులేషన్ చదువుచుండెను. తరచు మాయింటికి వచ్చుచు నాతోడను చంద్రశేఖరము తోడను కలసి చదువుకొనుచుండెను. షికారుబోవుచు ముచ్చటలు చెప్పుకొనుచు మైత్రితో కాలము గడుపుచుండెడివారము. ఈవిద్యార్థియు రాజమహేంద్రవరమునకే దరఖాస్తు పెట్టుకొనెను.

ఇట్లు రాజమహేంద్రవరములో పరీక్షనిచ్చుటకు నిశ్చయించుకొన్న వారందరమును అష్టదిక్పాలకులవలె ఎనిమిదిమందియును కలిసి యొక్కసారిగనే రాజమహేంద్రవరము చేరి, అచ్చట ఇన్నీస్‌పేటపెద్దవీధిలో రెండుమూడు కొట్లను అద్దెకు తీసికొని నివసించుచు పూటకూలిబసలో భోజనముచేయుచుంటిమి. అప్పుడు మేము వెలుపలకుపోయినపుడెల్ల అందరము కలిసియేపోవుచుంటిమి. ధోవతులు కట్టుకొని తెల్లలాంగుకోట్లు తొడిగి, ఎఱ్ఱటోపీలను ధరించి, యేగుచుండుమమ్ము చూచువారలకు వినోదముగానుండి "మీ రేవూరి వా"రని ప్రశ్నించు