పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/46

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మిక్కిలి సమర్థులు. ఊలుదొరగారివలెనే నీతివర్తనులగు సాధుపురుషులు. వీరు కొంతకాలము గుంటూరు మునిసిపాలిటీకి ఛెయిర్మనుగా నుండి మంచివారని శ్లాఘ్యతగాంచిరి. ఆ పాఠశాలలో మెట్రిక్యులేషన్ చదువుబాలురలో శేడింబి హనుమంతరావు అను చిన్నవాడు మంచి తెలివిగలవాడని చెప్పుకొనుచుండిరి. మే మొకరినిగూర్చి యొకరు వినుచుంటిమేగాని ఇరువురము కలుసుకొనుటమాత్రము సంభవించలేదు.

మెట్రిక్యులేషను పరీక్ష

గవర్నమెంటుహైస్కూలులో చదువుకొనుచుండు మల్లాది సోమయాజులుగూడ ఆయేడు మెట్రిక్యులేషన్ చదువుచుండెను. ఈ సోమయాజులే నాటకశాలలో హాస్యముచెప్పు విదూషకుడుగ నుండుటచే నాకు స్నేహితుడు. ఈతడు నాకంటె రెండుమూ డేండ్లు పెద్ద. హనుమంతురావని పైనచెప్పబడిన గవర్నమెంటుపాఠశాలావిద్యార్థి నాయీడువాడే.

ఈ ప్రాంతముల మెట్రిక్యులేషన్‌పరీక్షనిచ్చువారు మచిలీపట్టణ కేంద్రమునకే పోవుచుండిరి. కాని సోమయాజులును మరికొందరు మిత్రులును గలసి మచిలీపట్టణముకంటె బాగుండుననియెంచి రాజమహేంద్రవరకేంద్రమునకు దరఖాస్తులు పెట్టుకొనిరి. నాచేతను నాకు సహపాఠిగానున్న కోడూరి చంద్రశేఖరముచేతను ఆ కేంద్రమునకే దరఖాస్తులు పెట్టించిరి.