పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మిషను పాఠశాల

నేను చదువుకొనుచున్న మిషన్‌పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అమెరికాదేశమునుంచి వచ్చిన యొక పాదరి. ఆయన పేరు డాక్టర్‌యూలు. వీరుమిక్కిలి దైవభక్తిగలవారు. నీతివర్తన యందు ఈడులేనివారు. అసిధారావ్రతచర్య నడుపు మహార్య శ్రేణిలోచేరిన మహానుభావుడు. క్రీస్తుసిద్ధాంతములను తదేక నిష్ఠతో ఆచరింప ప్రయత్నించుచుండెడివాడు. ఇట్టి సత్పురుషునియొద్ద నేను విద్యాభ్యాసము బడయుఅవకాశము కల్పించినందుకు ఇప్పటికిని పరమేశ్వరుని కృతజ్ఞతతో తలచుచుందును. నా జీవితములోని నైతికవిషయములందు తండ్రిగారును ఈ విద్యాగురువులగు యూలుదొరగారును నాకు మేలుబంతులు. వారు పెట్టిన ఒరవడిని నేను అనుదినము ననుసరించి ప్రవర్తింప ప్రయత్నించినాను. తక్కిన పాఠములవలెనే క్రైస్తవ మతగ్రంధమగు బైబిలుపాఠమును క్రమముగ పఠించెడివాడను. సామాన్యముగ తక్కిన విద్యార్థులకంటె శ్రద్ధతో చదువుచు, చురుకుగానుంట గమనించి, నాయందు ఉపాధ్యాయులు ప్రేమ పూరితులై యుండిరి. ప్రధమఫారములలో చదువు ప్రారంభించినప్పుడే శ్రీ నారప్పగా రను నొకౌపాధ్యాయులు నన్నెక్కువ ఆదరించుచుండిరి. వారింటికి బోయి రాత్రివేళ అక్కడనే చదువుకొనుచుండెడివాడను. వారింటిలో ఆడవారుసహితము నన్నాదరణతో చూచుచుండెడివారు. పైతరగతులలోనికి వచ్చిన కొలదియు నావిషయము శ్రీ ఊలుదొరగారు ఎక్కువగ పరికించుచుండిరి.