పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/40

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మేర్పడుటచేత దీనిని అట్లు ప్రజలు పిలువనారంభించినారు. మేము ఈ సంఘము నడిపినంతకాలము ద్రవ్యాపేక్షలేక కేవలము వినోదముగనే నడిపించియుంటిమి. ఒక్కసారి రాజమహేంద్రవరములో మా నాటకసంఘము హరిశ్చంద్రనాటకము ప్రదర్శించెను. మొదటిసారి ఆనాటకము వేసినరోజున ఎవ్వరో పాకపై నిప్పువేయుటచేత ప్రేక్షకులలో కలవరముకలిగి పాకలోనుండి వెలుపలకు తప్పించుకొనిపోవలెనను తొందరలో నొకరినొకరు త్రొక్కుకొనుట, కొందరికి గాయములగుట మొదలగు ప్రమాదములు సంభవించినవి. కాని రెండవసారి వేసిననాటకము చాల జయప్రదముగ నడిచెను. అక్కడ ప్రధానన్యాయవాదులలో నొకరైన మాకర్ల సుబ్బారావునాయుడుగారును గవర్నమెంటు కాలేజిలో లెక్చరరుగానున్న శ్రీ వావిలాల వాసుదేవశాస్త్రిగారు మొదలగు పురప్రముఖులు నాటకముదర్శించి పాత్రల సామర్ధ్యమును మిక్కిలి పొగడిరి.

నాటకములలో పాత్రవహించిన కారణమున చిన్నతనము నుండియే గుంటూరుపట్టణమునందు సామాన్యముగ నన్ను పలువురు గుర్తించుచుండిరి.

ఇట్లు నాటకములలో పాల్గొనుచున్న కారణమున నా బడిలో పాఠములకు లోటురాకుండ చక్కగనే చదువుచు పరీక్షలలో మెప్పుగ కృతార్ధతచెందుచు ప్రతిసంవత్సరము వార్షికోత్సవ సభలలో బహుమతులను పొందుచుండుటచేత మా తండ్రిగారికి నాటకములలో తిరుగుట ఇష్టములేకపోయినను నాకు ఆవిషయమున ఎట్టి అడ్డుపాటును గావించినవారుకారు.