పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/39

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


గుమాస్తాలుగానుండిన పొత్తూరు కృష్ణయ్య, భువనగిరి హనుమద్దీక్షితులు, భాగవతుల రాఘవయ్యగార్లును, గుంటూరు ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగానున్న భాగవతుల చెన్నకృష్ణయ్యగారును చాల శ్రద్థతో జరుపుచుండిరి. శ్రీ మల్లాది సోమయాజులు, ఇవటూరి వియ్యన్న గార్లును విదూషకవేషమున మిక్కిలి సమర్థులు. ప్రతినాటకమునందు నాయకపాత్రకు కలపటపు నరసింహము అను నొక విద్యార్థి సమర్థుడుగనుండెను. ఈయన బందరులో పిమ్మట కొంతకాలమునకు శెకండుగ్రేడు ప్లీడరుగ పనిచేసిరి. నాకు ప్రతినాటకమందును ముఖ్యమగు స్త్రీపాత్ర నియమించిరి. చెన్నూరు సూర్యప్రకాశరావు, భువనగిరి సూర్యనారాయణ యను మరియిరువురుగూడ స్త్రీవేషములు వేయుచుండిరి. వారివేషములు ఎక్కువ అందముగ నుండెడివిగాని వారిలో కధనడిపించు సామర్థ్యము కొంత కొరవబడియుండుటచేత నన్నే ప్రధానస్త్రీపాత్రగా నేర్పరచ వలసివచ్చినది. ఆకృతిగూడ పాత్రోన్నతికి అనుకూలముగనే యుండి ప్రసంగములలో సందర్భోచితముగ రసపోషణచేయుచు ప్రేక్షకుల హృదయముల నాకర్షించుచుంటినని పలువురు నన్ను మిక్కిలి అభినందించుచుండిరి. మంగళపల్లిశాస్త్రి యను నొకరు నాటకములలో విశ్వామిత్రవేషమును, రౌద్రరసప్రధానమగు ఇతరవేషములను వేయుచుండిరి. ఇతని ప్రసంగములు మిక్కిలి శ్లాఘ్యములుగ నుండెడివి. మొత్తమున ఈనాటకసంఘమున చేరినవా రందరును సమర్థులని పేరుపొందినవారు. ఈ నాటక సంఘము గుంటూరులో ఫస్టుకంపెనీ అని పిమ్మట కొన్ని సంవత్సరముల వరకు పేరుగాంచెను. పిమ్మట మరియొకసంఘము