పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మాతమ్ముడును నేనును కలిసి అన్నముతిని మధ్యాహ్నము రెండు గంటలవరకును ఉండి మరల నిరువురమును అన్నముతినిపిమ్మట తమ్ముని బడికిపంపి నేను బడికిపోవుచుండెడివాడను. మరల సాయంకాలము ఇంటికిచేరి చీకటిపడునప్పటికి దీపమువెలిగించి యింటిలో నుండలేక మే మిరువురమును తలవాకిట గూరుచుండి మాతండ్రిగారిరాకకు ఎదురుచూచుచుండువారము. ఒక్కొక్క సారి లోపలికిబోయి అమ్మా యని పిలిచి ఏడ్చుచు మరల వెలుపలకువచ్చుచుండువారము. మానాయనగా రింటికివచ్చినపిమ్మట ప్రొద్దుటివంటపదార్ధములనే మువ్వురమును తిని పరుండెడివారము. ఈరీతికష్టములు ఏడుసంవత్సరములు పడినపిమ్మట మా మేనత్తగారు తనంతటతానే మాయింటికి వచ్చినందున అప్పటినుండి మానాయనగారికి ఇంటిపనులభారము తప్పెను. మేమందరము కొంతసౌఖ్య మనుభవించితిమి. నేను నాబడిలో చక్కగ పరీక్షలలో కృతార్థుడనగుచుండుటయేగాక తరగతిలో మెరుగుగ నుండుటచే జీతమీయనక్కరలేకుండ ఉపకారవేతనము నిచ్చుచుండిరి. ఇదిగాక కొన్ని పుస్తకములును బహుమతిగ నిచ్చుచుండెడివారు. ఏటేట జరుగువార్షి కోత్సవసభలలో బాలురచేత పద్యములు పాడించుచు వినోదసంభాషణలు (Dialogues) చేయుచుండిరి. ఒకసారి మరియొకవిద్యార్థితో నట్టి సంభాషణ గావించుటలో నేను రోకంటిపాటవలెగాకుండ సహజరీతి భాషించుటచేత సభ్యు లంద రానందమొందిరి. అప్పుడు మాకు ఆంధ్రోపాధ్యాయులుగానుండిన శ్రీ కొండుభట్ల సుబ్రహ్మణ్యశాస్త్రిగారు కొన్ని నాటకములు తెలుగున వచనశైలిని వ్రాసి వానిని ప్రదర్శింపవలెనని కుతూహలపడుచుండిరి. వారు అందుకు