పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రావుగారు ప్రధానోపాధ్యాయుడుగానుండి బాగా చదువునేర్పువారని పేరుగాంచెను. ఈపాఠశాలలో నాకంటె చాల పెద్దవారు, పదునారు పదునేడేండ్లు వయస్సుగలవారుగూడ చదువుచుండిరి. ఒక్కొక్కప్పుడు ఈబాలురను బెత్తముతో వీపుమీద మాష్టరుగారు బాదుచుండ చిన్నబాలురము మిక్కిలి భయపడుచుంటిమి. ఆదినములలో విద్యార్ధులను బెత్తముతోకొట్టుట చదువులపంతుళ్ళకు అభ్యాసము. ఇంగ్లీషు బళ్ళలో బెంచిఎక్కించినిలువబెట్టు మరియొక శిక్షగూడ వాడుకలోనుండెను. తెలుగుబడిలో చదువునప్పుడు పంతులుబడిలో లేనపుడు పిల్లలు అల్లరిచేయుచుండిరి. పంతులుగారు ఇంటిలోపలినుండి కోపముతోవచ్చి కేకలువేయుచు బెత్తముతోనందరిని వరుసగ బాదుచుండెడివారు. దైవవశమున నేనుమాత్రము బెత్తపుదెబ్బలు తినుట ప్రాప్తించ లేదు. నాపాఠములు ఏమరుపాటులేక చదివి ఒప్పజెప్పుచుంటిని. కనుక నాయందు వారు దయతోనుండెడివారు. ఒకటిరెండు సంవత్సరములు ఈసూర్యనారాయణగారిస్కూలులో చదివినతర్వాత మిషన్‌హైస్కూలులో మూడవక్లాసు అనగా ఇప్పటి ఫస్టు ఫారమునకు సరిపోవు తరగతిలో ప్రవేశపెట్టిరి. ఈపాఠశాల పాతగుంటూరునుంచి కొత్తగుంటూరువచ్చు రోడ్డుమీదనె యుండెడిది. కావున నేను పోయివచ్చుటకు సుకరముగనుండెను.

ఇక్కడ చదువుచుండగా మాతండ్రి ఉదయమున ఇంట వంటచేసి భోజనముచేసి, మాతమ్ముని బడికిపంపి తాను బజారునకు పోవుచు ఇంటితాళముచెవి నా బడిదగ్గరకు వచ్చి నా కిచ్చిపోవుచుండిరి. నేను బడివిడిచినపిదప పదిగంటలకు ఇంటికిపోయి