పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మాతండ్రి కావపారుగా నుండు దృడకాయుడు. ప్రతిదినమును ఉదయముననే చెరువుకు బోయి స్నానముచేసి సంధ్యావందనముచేసుకొని, పేటకు బోయి, మధ్యాహ్నమునకు ఇంటికి వచ్చి, మడిగట్టుకొని సంధ్యవార్చి భోజనముచేయువారు. రాత్రి ప్రొద్దుపోయి ఇంటికివచ్చినను సంధ్యవార్చుకొనియే భోజనము చేయుచుండిరి. ఇట్లు ప్రతిదినము మూడుసారులు సంధ్యావందనము చేయుటయు, అప్పుడప్పుడు దేవాలయమునకు బోయి దేవదర్శనము చేసుకొనుటయు వారికి అభ్యాసము. ఇంతకుమించిన మతవిషయమైన ఆలోచనలు ఆయనకు ఉండినట్లు కనపడవు. ఆయన సాధారణముగ కోపదారి. కొంత కఠినహృదయముకలిగి మిక్కిలి మితభాషిగా నుండెడివారు. తనసొమ్ము రవ్వంతయైన నితరులకు బోనీయక మితవ్యయముతో కాలముగడపుచు ఉన్నంతలో ద్రవ్యము కూడబెట్టి వృద్ధిచేసిరి. పాతభూమికి ఎరువుదోలించి బాగుచేయించి పాలికిచ్చి ఫలదాయకముగావించిరి. మరికొన్ని కొత్త భూములు కొనిరి. తనద్రవ్యము బీరుపోకుండ నెంత గట్టిపట్టుగనుండునో యితరులసొమ్ముపట్లగూడ అంత పట్టుగనే యుండి తృణమైన అపేక్షించువారు కారు. ఇతరులపై నాధారపడక స్వప్రయత్నమువలననే తనపనులు సాగించుకొనవలెనను గట్టిదీక్షతో వర్తించుచుండెను. మాతల్లి దయాదాక్షిణ్యములు గలది. బీదసాదల కష్టములకు జాలిచెందియు, ఒక్క కాసైనను చేతలేమి, నేమియు చేయలేకుండెను. ఇంటిలో బియ్యము, పప్పు మొదలగు ద్రవ్యములు సమృద్ధిగ నుండినను వానిలోనుంచి ఇతరుల కిచ్చినచో మాతండ్రిగారు కోపపడునని మిక్కిలి భయపడుచుండెను. కాని ఒకానొకపుడు, మిక్కిలి