పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నొచ్చుచున్నవని మా తండ్రిగారితో పలుమార్లు చెప్పుచుండుటచేత నొక మధ్యాహ్నము పేరుపడిన తంబలవైద్యు నొకని పిలుకొనివచ్చిరి. ఆయన తన యిత్తడిపెట్టెలో నున్న కుప్పెకట్టులు కొన్ని బండమీద నూరి, మాత్రలుకట్టి, ఒక పెద్దమాత్ర ఆమెచే తినిపించుటయేగాక బండకడిగిన ఔషధపునీళ్లుగూడ త్రాగించి వెళ్లిపోయెను. సాయంకాలమగునప్పటికి విరేచనములు ప్రారంభమై పలుసారులు రక్తముగూడ పడసాగెను. పిమ్మట నొడలు చలువలుగమ్మి నోటిమాట పడిపోయినది. ఆ వైద్యుని పిలిపించిననూ మరల రాలేదు. పిమ్మట పదునైదురోజులు దాదామియా యను యునానీడాక్టరు, పేరుపొందినవాడే, ఏవేవో ఔషధములిచ్చెను గాని దినదినము క్షీణించి పదునారవరోజున మాతల్లిగారు మరణించిరి.

ఆమె చనిపోవునాటికి ముప్పదియేండ్లది. ఆమె మొదటి నుండియు సుకుమారముగ పెరిగినది. గాన బలహీనురాలు. సామాన్యముగ ఆరోగ్యముగనే యుండునది. ఇంటిలో దాసీపని వారు లేరుకావున కసవుఊడ్చుట, ఇల్లుఅలుకుట, అంట్లుతోముట చెరువుకు పోయి నీళ్లుతెచ్చుట, మడిబట్టలు తడిపి పిండి ఆరవేయుట, బావికి పోయి మడినీళ్లుతెచ్చుట మొదలగు పనులన్నియు ఆమె యొంటిగనే చేయుచుండెను. బిడ్డలపోషణ, ఇంటిలో వంట, పెట్టు అనునవి ఆమెకుతప్పనివే. సాధారణముగ ప్రతిగృహమందును ఆడవారు ఈ పనులన్నియుచేయుట ఆకాలమున అగౌరవముగ నెంచెడివారు కారు. ఈదినములలోనైనను పల్లెటూళ్లలో సామాన్యకుటుంబములలో ఈరీతినే ఆడవారుపాటుపడుచుందురు.